అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు మంగళవారం సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. అఫ్గాన్‌తో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన పాక్ ఓపెనర్ మొహమ్మద్ హురైరా.. టీమిండియాతో మ్యాచ్ అంటే ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. శుక్రవారం అఫ్గాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో హురైరా (64) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపించాడు.
ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ బౌలర్ నూర్ అహ్మద్.. హురైరాను మన్కడింగ్ విధానంతో ఔట్ చేశాడు. దాన్ని ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్‌కు నివేదించగా పాక్ ఓపెనర్ ఔటయ్యాడని తేలింది. అనంతరం పాక్ నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. గ్రూప్ బీ నుంచి టాప్‌లో నిలిచిన పాకిస్థాన్.. గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌తో సెమీస్‌లో తలపడనుంది.
"భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఎప్పుడూ శతృత్వం ఉంటుంది. తాజా పరిస్థితుల్లో కాస్త ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అయితే దానికి అలవాటు పడతాం. నేను దీన్ని ఒక సాధారణ మ్యాచ్‌లాగే పరిగణిస్తా. అలా ఆడేందుకే ప్రయత్నిస్తా. ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటాం" అని పాక్ ఓపెనర్ చెప్పుకొచ్చాడు.
ఐదో టైటిల్ వేటలో భారత్...
ప్రస్తుత టోర్నీలో కెప్టెన్ ప్రియమ్‌గార్గ్ నేతృత్వంలోని టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా ఓడకుండా దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. పాకిస్థాన్ అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్‌ను ఒకేసారి ఓడించింది. అది కూడా 2006లో. అప్పుడు పాక్ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. అంతకుముందు 2004లో తొలిసారి మెగా కప్పును ముద్దాడింది. మరోవైపు యువ భారత్ ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు అత్యధికంగా నాలుగుసార్లు టైటిల్ సాధించింది. ఇప్పుడు ఐదోసారి ప్రపంచకప్‌పై కన్నేసింది.