గతేడాది భారత జట్టు సాధించిన అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టేందుకు అప్పటి సారథి పృథ్వీషా సలహాలు కోరాడు ప్రస్తుత కెప్టెన్ ప్రియమ్ గార్గ్. జట్టు ప్రణాళిక, ఆటగాళ్లను సమన్వయం చేయడం వంటి విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. త్వరలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీని కూడా కలవనున్నట్లు తెలిపాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది.
"పృథ్వీషాతో చాలా విషయాలు చర్చించాను. ప్రణాళిక రచించడం, కీలక సమయాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కొన్ని సూచనలు చేశాడు. ఆటగాళ్లు ఎంత దగ్గరైతే అంత బాగా ఆడతారని షా సూచించాడు. మొదట ఆటగాళ్ల బలాలేంటో గుర్తించాలని అన్నాడు. 2018లో ప్రపంచకప్ గెలిచేందుకు క్రికెటర్ల మధ్య అనుబంధమే కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. డిఫెండింగ్ ఛాంపియన్లుగా వెళుతున్న మాపై ఒత్తిడేమీ లేదు. అంతపెద్ద టోర్నీలో జట్టుకు సారథ్యం వహించడం నాకు పెద్ద అవకాశంగా భావిస్తున్నా. సారథిగా జట్టును ముందుకు తీసుకెళ్లడం, కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం గురించి ఆలోచిస్తున్నా. త్వరలో విరాట్ కోహ్లీని కలుస్తాను"
- ప్రియమ్ గార్గ్, టీమిండియా అండర్-19 కెప్టెన్
గతంలో మహ్మద్ కైఫ్(2000), విరాట్‌కోహ్లీ(2008), ఉన్ముక్త్ చంద్(2012), పృథ్వీషా(2018) సారథ్యంలో భారత్ నాలుగుసార్లు అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచింది.