ప్రయోగాత్మక మహిళల టీ20 మ్యాచ్ ఊహించని ఫలితాన్నిచ్చింది. తామేమి పురుషులకు తక్కువ కాదన్నట్లు ఆడారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆఖరికి విజయం ట్రైల్ బ్లేజర్స్నే వరించింది. సూపర్‌నోవాస్‌పై 2 పరుగుల తేడాతో గెలిచింది స్మృతి మంధాన సేన.
మిడిలార్డర్ మెరుపులు...
141 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ నోవాస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియా పునియా 1 పరుగుకే ఔటైంది. తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 24 పరుగులు), చామరి అటపట్టు 34 బంతుల్లో 26 పరుగులతో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరూ వెనువెంటనే పెవిలియన్ చేరడం వల్ల మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరిగిపోయింది.
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్...
సూపర్నోవాస్ సారథి హర్మన్ ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 46 పరుగులతో( 8 ఫోర్లు) ఆకట్టుకుంది. చివరి రెండు బంతుల్లో 7 పరుగులు అవసరమైన సమయంలో ఫోర్ కొట్టి ఆశలు కల్పించింది. చివరి బంతికి 3 పరుగులు అవసరమైనా ... బంతి బ్యాట్‌కు తగలలేదు. దీంతో 2 పరుగుల తేడాతో ఓడింది నోవాస్ జట్టు. ధోనీ తరహాలో కీపర్ లియో చివరి బంతికి అద్భుతమైన ఔట్ చేసింది.
ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లలో దీప్తి, షకీరా, జులన్ తలో వికెట్ తీసుకున్నారు. చివరి ఓవర్ వేసిన జులన్ తన అనుభవంతో మంచి బౌలింగ్ ప్రతిభ చూపించింది.
మంధాన మెరుపులు...
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రైల్ బ్లేజర్స్ జట్టు 140 పరుగులు చేసిందంటే కారణం... స్టార్ బ్యాట్స్ఉమెన్ స్మృతి మంధానే. ఓపెనర్లు విఫలమైనా 66 బంతుల్లో 90 పరుగులు ( 10 ఫోర్లు, 3 సిక్సులు) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిచింది. కాని శతకం కొట్టేందుకు వేగంగా ఆడి తృటిలో ఔటయింది. మరో క్రీడాకారిణి హర్లీన్ 44 బంతుల్లో 36 పరుగులతో మంచి ఇన్నింగ్స్ అందించింది.
సూపర్ నోవాస్ బౌలర్లలో రాధా 2 వికెట్లు తీయగా, అనుజా, సోఫీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.