తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ​కి చేనేత కార్మికుడి నుంచి అదిరిపోయే గిఫ్ట్​!

తమిళనాడుకు చెందిన అప్పూసామి అనే చేనేత కార్మికుడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 15 రోజులు కష్టపడి ధోనీ, జీవా చిత్రాలను ఓ దుప్పటిపై డిజైన్​ చేశాడు. ఈ కళాఖండాన్ని త్వరలోనే మహీకి అందిస్తానని అప్పు వెల్లడించాడు.

Tributes to Dhoni: Handloom worker designed a Blanket engraved with his image
కెప్టెన్​ కూల్​కు చేనేత కార్మికుడి బహుమతి

By

Published : Aug 27, 2020, 6:34 AM IST

'కెప్టెన్​ కూల్​'కు చేనేత కార్మికుడి బహుమతి

ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు మహేంద్రసింగ్​ ధోనీ రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఈ వార్త అభిమానులను నిర్ఘాంతపోయేలా చేసింది. మహీ వీడ్కోలుపై అనేక మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ.. అతడి అద్భుతమైన ఆటతీరు ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆదర్శమని కొనియాడారు. క్రికెట్​ ప్రముఖులతో పాటు ధోనీ రిటైర్మెంట్​పై సాధారణ అభిమానులూ స్పందించారు. 16 ఏళ్ల పాటు టీమ్​ఇండియాకు మహీ ఎనలేని సేవలందించాడని ప్రశంసించారు.

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీలోని ఆటతీరుతో పాటు అతడి వ్యక్తిత్వానికి ఫ్యాన్స్​ ఎక్కువ. వారందరూ అతడిని 'కెప్టెన్​ కూల్'​గా పిలుస్తారు. అయితే తమిళనాడులోని అభిమానులు మాత్రం ధోనీని అన్నలా భావించి 'తలా' అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

తమిళనాడులోని చెన్నిమలైకు చెందిన అప్పూసామి అనే చేనేత కార్మికుడు ధోనీపై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. ధోనీ, తన కుమార్తె జీవా చిత్రాలను ఓ దుప్పటిపై వచ్చేలా మగ్గంపై నేశాడు. దానిపై 'తలా' అని ఇంగ్లీష్​లో కనిపించే విధంగా రూపొందించాడు. గతంలో ఎంతోమంది ప్రముఖుల చిత్రాలను దుప్పట్లపై డిజైన్​ చేసి గుర్తింపు పొందాడు అప్పు. ఈ దుప్పటి రూపకల్పనకు దాదాపు 15 రోజులు పట్టిందని తెలిపాడు.

ధోనీ ప్రస్తుతం ఐపీఎల్​ కోసం యూఏఈ వెళ్లగా.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహీని కలిసి ఆ కళాఖండాన్ని స్వయంగా తానే అందిస్తానని అప్పూసామి వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details