టీ20 క్రికెట్లో బ్యాటింగ్ ఆర్డర్‌తో సంబంధం లేకుండా ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. టాపార్డర్ బ్యాట్స్మెన్ల దగ్గర నుంచి చిన్న హిట్టర్స్ వరకు అందరూ ఈ ఫార్మాట్లో పరుగులు రాబట్టడానికే ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఈ టోర్నీలో వ్యక్తిగత స్కోరు మూడంకెల పరుగులను చేరుకున్న పరిస్థితులు అరుదుగా ఉన్నప్పటికీ.. బ్యాట్స్‌మెన్ చేసిన అర్ధశతకాలే టోర్నీలో ఎక్కువ సార్లు గేమ్ చేంజర్స్‌గా మారాయి.
టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా బరిలో దిగిన ఆటగాళ్లు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున యాభై పరుగుల మార్క్‌ను సాధించడానికి వారికి వీలుపడుతుంది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ 12 సీజన్లలో అత్యధికంగా 50+ రన్స్ నమోదు చేసిన క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.
డేవిడ్ వార్నర్ (దిల్లీ, హైదరాబాద్) -48
ఐపీఎల్లో మొదటి నుంచి నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్మెన్లలో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఒకరు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించడం సహా అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ప్రత్యర్థి బౌలర్లను తన షాట్లతో ఉక్కిరిబిక్కిరి చేయడంలో వార్నర్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వార్నర్.. ఐపీఎల్లో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 48కి పైగా 50 ప్లస్ స్కోర్‌ను నమోదు చేశాడు. అత్యధిక అర్ధశతకాలు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో వార్నర్ ఆగ్రస్థానంలో ఉన్నాడు.
వార్నర్ ఐపీఎల్ కెరీర్లో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నీలో ఇతడు చేసిన అత్యధిక స్కోరు 126. 2009-2019 మధ్య ఆడిన 126 మ్యాచ్‌లలో వార్నర్ ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌కు దిగి.. 43.17 సగటుతో 4,706 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. వార్నర్ చేసిన ప్రతి అర్ధశతకం ఆ జట్టు విజయంలో కీలకంగా నిలిచింది. 48 అర్ధశతకాల్లో నాలుగు శతకాలు ఉన్నాయి. సెంచరీల జాబితాలో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీల తర్వాత మూడో స్థానంలో నిలిచాడు డేవిడ్ వార్నర్.
విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)- 41
ఆధునిక బ్యాట్స్మెన్లలో అన్ని ఫార్మట్లలో రాణించగల గొప్ప ఆటగాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఫార్మాట్‌ను బట్టి తన ఆటతీరును మార్చుతూ టాప్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు దశాబ్దం కాలంగా కెప్టెన్‌గా ఉంటూ తన జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
మూడో స్థానంలో ఎక్కువగా బ్యాటింగ్ చేసే విరాట్.. ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్లో 177 మ్యాచ్‌ల్లో 5,412 రన్స్ చేశాడు. 41 సార్లు యాభైకి పైగా పరుగులను సాధించగా.. అందులో 36 అర్ధసెంచరీలు 5 సెంచరీలున్నాయి. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక 50 ప్లస్ స్కోర్స్ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానాన్ని ఆక్రమించాడు.