గతేడాది ఐపీఎల్లో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్‌ను మన్కడింగ్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. మన్కడింగ్ నిబంధనల ప్రకారం అతను చేసింది సరైనదే అయినప్పటికీ.. దాన్ని క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భావిస్తారు. అయితే తాజాగా మరోసారి అశ్విన్ ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
'ముందే పరుగెత్తితే.. పరుగే ఇవ్వకూడదు'
టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి మన్కడింగ్ నిబంధనలపై స్పందించాడు. ఇటువంటి సందర్భాల్లో సాంకేతిక సాయంతో తప్పును గుర్తించాలని అభిప్రాయపడిన ఈ సీనియర్ బౌలర్.. పరుగులు కూడా ఇవ్వకుండా చూడాలని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
"ఇలాంటి సందర్భాల్లో సాంకేతికత సాయంతో బ్యాట్స్‌మన్ తప్పును గుర్తించి.. అలా చేసిన ప్రతిసారి పరుగులు ఇవ్వకుండా చూస్తారని ఆశిస్తున్నా. చాలామంది ఈ విషయంలో పక్షపాత వైఖరిని గుర్తించలేకపోతున్నారు. నేను బంతిని వేయకముందే రెండు అడుగులు ముందుకు వేయడం వల్ల నాన్ స్ట్రైకర్ అదనంగా రెండో పరుగు తీయగలిగితే.. మళ్లీ ముందున్న బ్యాట్స్‌మనే బంతిని ఎదుర్కొంటాడు. ప్రధాన బ్యాట్స్‌మన్ ఇలా అదనపు ప్రయోజనం పొందడం వల్ల.. మ్యాచ్‌లో చాలా తేడా జరగొచ్చు. అసలే బౌలర్లకు కష్టకాలం నడుస్తున్న ఈ తరుణంలో బంతికి, బ్యాటుకు మధ్య సమతూకం తేవాల్సిన అవసరం ఉంది" అని అశ్విన్ స్పష్టం చేశాడు.