తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీసేనకు 'ధర్మ సంకటం'- రాహుల్‌కు చోటెక్కడ?

ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​కు తుది జట్టు ఎంపికపై టీమ్ఇండియాలో తీవ్ర పోటీ నెలకొంది. టీమ్​లోకి రిషబ్​ ఎంట్రీతో పలు మార్పులు తప్పేలా లేవు. టాప్ఆర్డర్, మిడిలార్డర్​లలో ఒక స్థానానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. బౌలర్లలోనూ విపరీతమైన పోటీ ఉండటం వల్ల ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి సహా యాజమాన్యానికి పెద్ద చిక్కు వచ్చిపడింది.

T20 Dilemmas: Tough calls between Dhawan/Rahul, Chahar/Bhuvneshwar, Shreyas/Surya
కోహ్లీసేనకు 'ధర్మ సంకటం': రాహుల్‌కు చోటెక్కడ?

By

Published : Mar 8, 2021, 9:54 PM IST

ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీసు ముందు టీమ్‌ఇండియా యజమాన్యానికి తలనొప్పి మొదలైంది. తుది జట్టులో ప్రతి స్థానానికి ఇద్దరు పోటీపడుతున్నారు. మొత్తం 19 మందిలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రయోగాలు చేస్తారా? ప్రస్తుత సిరీస్‌ గెలవడమే లక్ష్యంగా అనుభవజ్ఞులనే కొనసాగిస్తారా? జూనియర్లు‌ సీనియర్ల మేళవింపుతో తుది 11 మందిని ప్రకటిస్తారా? కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు నిజంగా ఇది ధర్మ సంకటమే!

పంత్‌ ఫామ్‌తో మార్పులు

రిషబ్ పంత్

గతంలో ఒక్కో వేదికలో ఒక్కో మ్యాచ్‌ జరిగేది. ప్రస్తుతం ఐదు టీ20లనూ మొతేరాలోనే నిర్వహిస్తున్నారు. కాబట్టి తొలి మూడు మ్యాచులకే ఒకే తరహా జట్టును ఎంపిక చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్ పంత్‌ విధ్వంసకర ఫామ్‌లో ఉండటం వల్ల టాప్‌‌, మిడిలార్డర్లో మార్పులు తప్పనట్టే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌కు ఏ పాత్ర అప్పగించాలన్న సందిగ్ధం నెలకొంది. ఇప్పటి వరకు అతడే తొలి ప్రాధాన్య కీపర్‌. పంత్‌ వస్తే మాత్రం అతడు గ్లోవ్స్‌ ధరించడం కష్టమే!

రాహుల్‌ పాత్రేంటి?

రాహుల్

పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ ఓపెనర్లుగా స్థిరపడ్డారు. రాహుల్‌కు పొట్టి క్రికెట్లో ఓపెనర్‌గా మంచి రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా పరుగుల వరద పారించిన అతడు ధావన్‌కు గట్టి పోటీనిస్తున్నాడు. ఎందుకంటే విజయ్ హజారేలో గబ్బర్‌ 150 వరకు నామమాత్రపు పరుగులే చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీసేన రాహుల్‌ను ఓపెనింగ్‌ చేయిస్తుందేమో చూడాలి. అలా జరిగి ధావన్‌ మిడిలార్డర్లోకి వెళ్తే మాత్రం‌ రాణించడం కష్టం. ఇక హిట్‌మ్యాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సూర్య × శ్రేయస్‌

శ్రేయస్ అయ్యర్

టీమ్‌ఇండియా సారథి కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. పరిస్థితులను క్షణాల్లో మార్చేయగల మ్యాచ్‌ విజేతలు పంత్‌, హార్దిక్‌ పాండ్య 5, 6 స్థానాల్లో ఒదిగిపోతారు. అలాంటప్పుడు రాహుల్‌కు మిగిలింది నాలుగో స్థానమే. కానీ దానికోసం శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ పోటీపడుతున్నారు. ఫేవరెట్‌గా ఉన్న సూర్య కోసం శ్రేయస్‌ను తొలగించేందుకు కారణం కనిపించడం లేదు. మొత్తానికి ఈ ముగ్గురూ నాలుగో స్థానం కోసం పోటీ పడితే మాత్రం క్షణాల్లో గేర్లు మార్చగల రాహుల్‌కే అవకాశం. ఇక అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ తెవాతియాకు చోటెక్కడ ఇస్తారన్నది మరో ప్రశ్న.

బౌలింగ్‌లోనూ పోటీయే

టీమ్​ఇండియా

బౌలింగ్‌ విభాగంలోనూ పోటీ తీవ్రంగానే ఉంది. భువనేశ్వర్‌ కుమార్ రాకతో దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ స్థానాలకు ఎసరొచ్చింది! చాహర్‌తో పోలిస్తే డెత్‌, ఆరంభ ఓవర్లలో భువీకి మంచి అనుభవం ఉంది. కానీ వీరిద్దరూ ముస్తాక్‌ అలీలో ఎక్కువ క్రికెట్‌ ఆడలేదు. ఠాకూర్‌ మాత్రం బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మందకొడి మొతేరాలో యుజ్వేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ మధ్య ఉద్రిక్తకరమైన పోటీ ఉంది. నవదీప్‌ సైనితో పోలిస్తే వైవిధ్యమైన యార్కర్లు సంధించే నటరాజన్‌ మేలని భావన. సీనియర్లు మహ్మద్‌ షమి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా తిరిగొచ్చాక కోహ్లీసేనకు మరింత తలనొప్పి తప్పదన్నది నిజం!!

ఇదీ చూడండి:భారత మహిళల జట్టు.. ఆరేళ్ల తర్వాత తొలి టెస్టు

ABOUT THE AUTHOR

...view details