తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గెలిచినా నన్ను కెప్టెన్సీ నుంచి తీసేశారు' - సారథి బాధ్యత నుంచి గావస్కర్​ నుంచి తప్పించారు

ఓ దశలో వెస్టిండీస్‌పై సిరీస్​లో భారత్​ను​ గెలిపించినప్పటికీ.. తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశాడు దిగ్గజ క్రికెటర్ సునీల్​ గావస్కర్​. రంజీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన రాజిందర్​ గోయెల్​ రికార్డును టీమ్​ఇండియాలోని ఏ బౌలర్​ అధిగమించలేడని అన్నాడు.

sunil
సునీల్​

By

Published : Jun 28, 2020, 6:28 AM IST

Updated : Jun 28, 2020, 6:38 AM IST

"కొన్ని రోజుల కిందటే 1983 ప్రపంచకప్‌ గెలుపు వార్షికోత్సవం జరిగింది. దాని తాలూకు ఎన్నో మధురానుభూతులు వెంటాడాయి. కానీ కొన్ని రోజుల ముందే భారత్‌ రాజిందర్‌ గోయెల్‌ అనే స్పిన్‌ దిగ్గజాన్ని కోల్పోయింది. రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనుడతనే. ఆ రికార్డును అధిగమించడం అంత సులువైన పని కాదు. భారత జట్టుకు ఆడే ఏ బౌలర్‌కైనా అది అసాధ్యమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్లు దేశవాళీ క్రికెట్‌ ఆడటమే అరుదైపోయింది. అయితే రంజీ ఆటగాళ్లలో ఎవరో ఒకరు రాబోయే రోజుల్లో ఈ రికార్డును అధిగమించడం కష్టమేమీ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏటా ఓ జట్టు ఆడే రంజీ మ్యాచ్‌లు చాలా ఎక్కువ. టోర్నీలో ఆడే కొన్ని జట్లను చూస్తే నవ్వులాటగా ఉంది. లోధా ప్యానెల్‌ కొన్ని మంచి పనులు చేసినప్పటికీ.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా రంజీ హోదాను కట్టబెట్టి తప్పు చేసింది.

వాటిలో చాలా వాటికి సరైన క్రికెట్‌ మౌలిక వసతుల్లేవు. ఈ టోర్నీలో ఆడే స్థాయి లేదు. దీని వల్ల రంజీ ట్రోఫీ స్థాయి పడిపోయింది. తమ రాష్ట్రాల జట్లలో చోటు దక్కించుకోలేని వాళ్లు వెళ్లి కొత్త జట్లకు ఆడుతున్నారు. ట్రోఫీ స్వరూపం ఇలా మారిన రెండేళ్లకే బేడి పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డు (సీజన్‌లో) బద్దలైపోయింది. బ్యాటింగ్‌ రికార్డులు లెక్కలేనన్ని నమోదవుతున్నాయి. ఈ జట్లు ఆడుతున్నది ప్లేట్‌ గ్రూప్‌లోనే అయినా.. వాటికి కూడా ఫస్ట్‌క్లాస్‌ హోదా దక్కుతోంది. ఆ జట్లు ఆడే మ్యాచ్‌ల్లో డబుల్‌ సెంచరీలు విరివిగా నమోదవుతున్నాయి. వికెట్లు కావాల్సినన్ని పడుతున్నాయి. దీని వల్ల రంజీ రికార్డులకు విలువే లేకుండా పోయింది.

నా కెరీర్లో నేను ఎక్కువగా చింతించే విషయం.. గోయెల్‌ను టీమ్‌ఇండియాలోకి తీసుకురాలేకపోవడం. నేను కెప్టెన్‌ అయిన ఏడాది.. తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత బేడి స్థానంలో గోయెల్‌ లేదా శివాల్కర్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లతో పోరాడి ఓడిపోయాను. నిజానికి కెప్టెన్‌గా నా తొలి టెస్టులో బేడిని జట్టు నుంచి తప్పించాలని సెలక్టర్లు అంటే నేనే ఆపాను. అప్పుడే జట్టులోకి వచ్చిన కపిల్‌ దేవ్‌, గావ్రితో కలిసి బలమైన పేస్‌ జోడీగా మారారు. దీంతో స్పిన్నర్ల స్పెల్స్‌ తగ్గిపోయాయి. పిచ్‌లు కూడా వారికి మునుపట్లా సహకరించలేదు. మూడు మ్యాచ్‌ల తర్వాత చెన్నై టెస్టుకు సెలక్టర్లు బేడిని తప్పించి పేస్‌, స్పిన్‌ రెండూ వేయగల ధీరజ్‌ ప్రసన్నను ఎంచుకున్నారు. తర్వాతి ఏడాది ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత వెంకట్రాఘవన్‌ స్థానంలో మరోసారి నన్ను కెప్టెన్‌ని చేశారు.

అప్పుడు సెలక్టర్లు దిలీప్‌ దోషికి అవకాశమిస్తే నాలుగేళ్ల పాటు భారత జట్టుకు ఆడి 100కు పైగా వికెట్లు తీశాడు. ఒకప్పటి స్పిన్‌ చతుష్ఠయం లాగే అతను కూడా 1982-83లో పాకిస్థాన్‌లో జీవం లేని పిచ్‌లపై విఫలమై జట్టులో చోటు కోల్పోయాడు. వెస్టిండీస్‌పై 700కు పైగా పరుగులు చేయడమే కాక.. సిరీస్‌ కూడా గెలిపించినప్పటికీ నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారప్పుడు. అందుకు కారణమేంటో అంతుబట్టలేదు. కెర్రీ ప్యాకర్‌ వరల్డ్‌ సిరీస్‌ క్రికెట్లో చేరేందుకు నేను సుముఖంగా కనిపించడం అందుకు కారణమేమో. అయితే ఆ సిరీస్‌ ఆరంభానికి ముందే బీసీసీఐ కాంట్రాక్టుపై సంతకం చేయడం ద్వారా నేను నా నిబద్ధతను చాటుకున్నాను. భారత్‌ సిరీస్‌ ఓడినపుడు, ముఖ్యంగా విదేశాల్లో పరాజయం ఎదురైనపుడు కెప్టెన్‌ను తప్పించడం మామూలే. కానీ సిరీస్‌ గెలిచిన కెప్టెన్‌ను తప్పించడం మాత్రం అదే తొలిసారి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. భారత్‌ సిరీస్‌ కోల్పోతే కెప్టెన్‌ను తప్పించడం గురించి కనీసం చర్చ కూడా ఉండట్లేదు." అని సునీల్​ గావస్కర్​ అన్నాడు.

ఇది చూడండి : ద్రవిడ్​ ముందుచూపునకు ఆశ్చర్యపోయా: రైనా

Last Updated : Jun 28, 2020, 6:38 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details