ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రసవత్తరంగా కొనసాగుతోంది. చివరి రోజు గెలుపు కోసం ఇరుజట్లు శ్రమిస్తున్నాయి. ఓవైపు భారత బ్యాట్స్‌మన్ విజయం కోసం పోరాడుతుంటే ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన తీరు క్రికెట్ అభిమానుల్ని అసహనానికి గురి చేసింది.
ఏం జరిగింది?
407 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. రోహిత్, గిల్ మంచి ఆరంభాన్నిచ్చారు. తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓవైపు పుజారా డిఫెన్స్ ఆడుతున్నా.. పంత్ మాత్రం షాట్స్‌తో అలరించాడు. ఇతడి ఆట చూస్తే భారత్ మ్యాచ్ గెలిచేలా కనిపించింది. అయితే పంత్ ఆటను దెబ్బతీయడానికి ఆసీస్ మాజీ కెప్టెన్ స్మిత్ అతడి గార్డ్‌ను చెరిపేశాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో బ్యాటింగ్ క్రీజులోకి వచ్చి గార్డ్‌ను కాలితో చెరిపేశాడు. స్మిత్.. పంత్ ఆటను దెబ్బతీయడానికే అలా చేశాడని స్పష్టంగా అర్థమవుతోంది. తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్ మళ్లీ గార్డ్ తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన పంత్ భారీ షాట్ ఆడబోయి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. లియోన్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.