ప్రసుత క్రికెట్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)లలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. ఇప్పుడీ విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పాడు పాక్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడని తెలిపాడు.
"కోహ్లీ అన్ని ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం అతడి కంటే స్మిత్ బాగా రాణిస్తున్నాడు. అయితే అత్యుత్తమం అనిపించుకోవాలంటే ఒక్క ఫార్మాట్‌లో మెరుగ్గా ఆడితే సరిపోదు కదా! మూడు ఫార్మాట్లలోనూ బాగా ఆడాలి. ఆ విషయంలో కోహ్లీ మెరుగ్గా ఉన్నాడు. కోహ్లీని రన్ మెషీన్ అనకూడదు. ఎందుకంటే మెషీన్లు కొన్నిసార్లు రిపేర్‌కు వచ్చి పనిచేయవు. కానీ కోహ్లీ పరుగుల దాహానికి అలుపనేది ఉండదు. ప్రస్తుతం అతడికి సరితూగే బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు"