టీ20 ఫార్మాట్ రాకతో క్రికెట్ దశ, దిశ మారిపోయాయి. బ్యాట్-బంతి ఆటను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పొట్టి క్రికెట్ లీగ్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. మరి ఇంతగా ఆదరణ పొందిన ఆటకూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవే 50 ఓవర్ల ఆట, ఐదు రోజులు జరిగే టెస్టు మ్యాచ్‌ల పట్ల ప్రజలకు కాస్త ఆసక్తి తగ్గడం. వన్డేలను రసవత్తరంగా మార్చేందుకు ఇప్పటికే రౌండ్ రాబిన్ పద్ధతిలో వరల్డ్‌కప్‌ను, ఆకట్టుకునే సిరీస్‌లను తీసుకొచ్చింది. మరి టెస్టు క్రికెట్లోనూ మార్పులు చేయాలన్న ఐసీసీ ఆలోచన నుంచి వచ్చిందే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ). దాని విశేషాలు చూద్దాం...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ అంటే..?
ఈ ఏడాది ఆగస్ట్ 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరగుతున్న యాషెస్ సిరీస్ నుంచే ఈ యాత్ర ప్రారంభం కానుంది.
- ప్రపంచ క్రికెట్లో టాప్-9 జట్లు కలిసి 2 ఏళ్ల పాటు 27 సిరీస్‌లు ఆడతాయి. ఫైనల్‌తో కలిపి మొత్తం 72 మ్యాచ్‌లు ఈ ఛాంపియన్‌షిప్‌లో ఉంటాయి.
- ప్రతి జట్టు 3 సిరీస్‌లు స్వదేశంలో, మరో మూడు సిరీస్‌లు విదేశాల్లో ఆడతాయి.
- ఈ రెండేళ్ల కాలంలో జరిగిన ప్రతి మ్యాచ్‌కు కొన్ని పాయింట్లు ఉంటాయి. ఈ కాలపరిమితి ముగిసే లోపల ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఏ జట్లయితే టాప్-2లో ఉంటాయో అవి మాత్రమే ఫైనల్ చేరి ట్రోఫీ కోసం పోటీపడతాయి.
- 2021 జూన్‌లో ఇంగ్లాండ్‌లోని లార్డ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గెలిచిన జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంటుంది. ఇదే తొలిసారి కావడం వల్ల దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఉద్దేశం ఏంటి..?
డబ్ల్యూటీసీ ముఖ్య ఉద్దేశం టెస్టు క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం. ప్రతి మ్యాచ్‌కు పాయింట్లు ఉండటమే కాకుండా ప్రపంచ అత్యత్తమ జట్లే ఇందులో పోటీపడతాయి.
9 జట్లను ఎలా ?
2018 , మార్చి 31న ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్-9 జట్లకు ఇందులో అవకాశం లభించింది. ఈ ర్యాంక్‌ల ఆధారంగానే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ ఈ ఛాంపియన్‌షిప్‌లో స్థానం దక్కించుకున్నాయి.
ఎక్కడ ఆడతాయి..?
రెండేళ్ల కాలం పాటు వివిధ దేశాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. 2019 ఆగస్ట్ నుంచి ఈ మ్యాచ్‌లు ఆరంభమయ్యాయి.
ఫార్మాట్ ఏంటి..?
ఒక్కో జట్టు స్వదేశంలో 3, విదేశాల్లో 3 మ్యాచ్‌లు ఆడతాయి. మ్యాచ్ ఆడే జట్ల మధ్య పరస్పర అంగీకారం ఉంటుంది. ప్రతి సిరీస్‌లో మ్యాచ్‌ల సంఖ్య ఒకేలా ఉండవు. రెండు నుంచి ఐదు మ్యాచ్‌లు కలిపిన సిరీస్‌లు ఉంటాయి.
డే అండ్ నైట్ మ్యాచ్‌లు..?
ఐదు రోజుల మ్యాచ్‌లను రాత్రి-పగలు కలిపి ఆడించే అవకాశం ఉంది. కాని ఇది ఇరు జట్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
పాయింట్లు ఎలా.?
ప్రతి జట్టు 6 సిరీస్‌లు ఆడుతుంది. ఒక్కో సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించారు. ఒక సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఉంటే ఆ పాయింట్లను అన్ని భాగాలు చేస్తారు.(ఉదా:- నాలుగు మ్యాచ్‌లు ఉంటే ఒక్కో మ్యాచ్‌కు 30 పాయింట్లు, 3 మ్యాచ్‌లు ఉంటే ఒక్కో మ్యాచ్‌కు 40 పాయింట్లు కేటాయిస్తారు.)