"పంత్‌కు మతి పోయినట్లుంది. అండర్సన్ బౌలింగ్‌లో.. అదీ కొత్తబంతితో ఎవరైనా రివర్ స్వీప్ ఆడతారా".. ఇవీ 23 ఏళ్ల పంత్ గురించి సామాజిక మాధ్యమాల్లో కనిపించిన వ్యాఖ్యలు! అవును.. ఎవరి అంచనాలకు అందని విధంగా ఆడటమే అతని నైజం! పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా.. ఒత్తిడి చిత్తు చేస్తున్నా.. తనదైన శైలిలో చెలరేగడమే అతడికి అలవాటు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇలాంటి ఇన్నింగ్స్‌లతోనే సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతను.. ఇప్పుడీ శతకంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్‌ను మరింత చేరువ చేశాడు.
నాలుగో టెస్టు రెండో రోజు ఆట చివరి సెషన్‌లో.. కొత్త బంతితో వికెట్ పడగొట్టి పంత్ దాడి నుంచి జట్టుకు ఉపశమనాన్ని కల్పించాలని అండర్సన్ సిద్ధంగా ఉన్నాడు. అప్పటివరకూ బాగానే ఆడుతున్న పంత్.. ఈ కొత్త బంతిని ఎలా ఎదుర్కొంటాడనే ఆసక్తితో అభిమానులున్నారు. తొలి బంతి పిచ్ మీద పడిందో లేదో.. క్రీజులో నుంచి ముందుకు దూసుకొచ్చిన అతను దాన్ని లాంగాఫ్‌లో బౌండరీకి తరలించాడు. అంతే అందరిలో ఆశ్చర్యం. కొత్త బంతి అనే భయం లేకుండా.. వేసేది మేటి పేసర్ అనే బెరుకు లేకుండా అతనాడిన ఆ షాట్‌కు స్టేడియం ఊగిపోయింది. ఆఫ్‌సైడ్‌కు ఆవల పడ్డ ఆ తర్వాతి బంతినీ అతను వదల్లేదు. ముందుకు సాగి దాన్ని తనదైన శైలిలో కవర్స్ దిశగా బౌండరీ దాటించాడు.
ఇక అండర్సన్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో తొలి బంతికి పంత్ ఆడిన షాట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడా షాటే ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు మొదలు అభిమానుల వరకూ అందరి సామాజిక మాధ్యమ ఖాతాల్లో చర్చనీయాంశమైంది. శతకానికి 11 పరుగుల దూరంలో మాత్రమే ఉన్న సమయంలో అతను ఆ రివర్స్ స్వీప్ ఆడతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఫుల్ లెంగ్త్ డెలివరీని సరిగా అంచనా వేసిన పంత్ రివర్స్ స్వీప్‌తో దాన్ని స్లిప్ ఫీల్డర్ల మీద నుంచి బౌండరీ పంపించాడు. అయితే స్పిన్నర్ల బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ రివర్స్ స్వీప్‌తో గల్లీ, పాయింట్ వైపుగా పరుగులు రాబట్టాలని చూస్తారు. కానీ పంత్ మాత్రం బంతిని అమాంతం స్వీప్‌తో స్లిప్ మీదుగా పంపించాడు.
ఇక రూట్ వేసిన ఆ తర్వాతి ఓవర్ తొలి బంతినే కళ్లు చెదిరే రీతిలో ఓ మోకాలిని నేలకు ఆనించి స్క్వేర్‌లెగ్‌లో సిక్సర్‌తో అతను శతకాన్ని అందుకోవడం విశేషం. ఇలాంటి అత్యుత్తమ షాట్లతో, ఎప్పటికీ నిలిచిపోయే బ్యాటింగ్‌తో జట్టుకు కష్టాల నుంచి గట్టెక్కించిన పంత్ ఇన్నింగ్స్ ఒక అద్భుతం! అనూహ్య బౌన్స్ సహకారంతో చెలరేగుతున్న ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొలేక జట్టులోని ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరిన ఆ పిచ్ మీద పూర్తి పరిణతితో, ఆత్మవిశ్వాసంతో, తెలివిగా ఆడుతూ పంత్ చేసిన ఈ సెంచరీ చిరస్మరణీయం.
తుపానుకు ముందు..