యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. రెండు మ్యాచ్‌లతో ఈ సీజన్ పూర్తి కానుంది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆరు నెలలు వాయిదా పడిన మెగా ఈవెంట్.. వచ్చే ఏడాది ఎప్పటిలాగే భారత్‌లో నిర్వహిస్తామని, అది కూడా ఏప్రిల్, మే నెలలోనే జరుపుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఆయన ఇండియాటుడే ఇన్‌స్పిరేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఈ ఒక్క సీజన్ మాత్రమే యూఏఈలో నిర్వహిస్తున్నామని తర్వాతి సీజన్ కచ్చితంగా భారత్‌లోనే కొనసాగిస్తామని చెప్పాడు. అలాగే రెండు, మూడేళ్లలో మహిళల టీ20ల్లోనూ ఏడెనిమిది జట్లు తీసుకొస్తామని పేర్కొన్నాడు. ఈ సీజన్ పూర్తయ్యాక టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆ పర్యటనపై స్పందించిన మాజీ సారథి.. అక్కడ కోహ్లీ కెప్టెన్సీపైనే టీమ్‌ఇండియా విజయాలు ఆధారపడి ఉంటాయని చెప్పాడు.
"చివరిసారి భారత్.. కంగారూ పర్యటనకు వెళ్లినప్పుడు 2-1 తేడాతో చారిత్రక టెస్టు విజయం సాధించింది. అయితే, అప్పుడు వార్నర్, స్టీవ్‌స్మిత్ లేరు. ప్రస్తుతం ఆ ఇద్దరికి తోడు లబుషేన్ ఆ జట్టులో రాణిస్తుండటం వల్ల భారత్ గెలవడం అంత సులువు కాదు. దీంతో టీమ్‌ఇండియా విజయాలు విరాట్ నాయకత్వంపైనే ఆధారపడ్డాయి"