బంగ్లాదేశ్ ప్రముఖ క్రికెటర్ షకిబుల్ హసన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నోరోజులు కష్టపడి, తన ప్రదర్శన ద్వారా తెచ్చుకున్న ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అతడికి చోటివ్వలేదు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). అవినీతి నిరోధక నియమాలను ఉల్లంఘించినందుకు రెండేళ్లు నిషేధం విధించిన ఐసీసీ... తాజాగా అతడి పేరును టీ20 ర్యాంకింగ్స్ నుంచి తీసేసింది.
తాజాగా విడుదల చేసిన పొట్టి ఫార్మాట్‌కు చెందిన ఆల్‌రౌండర్ల జాబితాలో.. అతడికి స్థానం దక్కలేదు. వేటు పడకముందు రెండో స్థానంలో ఉండేవాడు షకీబ్. అయితే ప్రస్తుతం అఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ.. టీ20ల్లో ఆల్‌రౌండర్ విభాగంలో అగ్రస్థానం సంపాదించాడు. ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్స్‌వెల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాకు చెందిన మరో ఆటగాడు మహ్మదుల్లా రియాద్ 4వ స్థానంలో ఉన్నాడు.
బౌలర్ల జాబితాలో భారత్ నుంచి దీపక్ చాహర్ 88 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో నిలిచాడు. టాప్ పదిలో తొమ్మిది మంది స్పిన్నర్లే ఉండటం విశేషం.