తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ పితృత్వపు సెలవులు.. సెహ్వాగ్ కోచ్ అసహనం'

టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్​కు దూరమయ్యాడు. పితృత్వ సెలవుల కారణంగా మొదటి టెస్టు అనంతరం భారత్​కు వచ్చేశాడు. అయితే మొదటి మ్యాచ్​లో భారత్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా కోహ్లీ ఇలా ఇంటికి రావడం తనకు నచ్చలేదని తెలిపారు సెహ్వాగ్​కు కోచ్​గా వ్యవహరించిన ఏఎన్ శర్మ.

Sehwags coach takes a dig at Kohli for taking paternity leave
'కోహ్లీ అలా రావడం నచ్చలేదు'

By

Published : Dec 24, 2020, 12:11 PM IST

టీమ్ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి భారత్‌కు చేరుకున్నాడు. సతీమణి అనుష్క శర్మ వచ్చే నెలలో తొలి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ నేపథ్యంలోనే అతడు పితృత్వపు సెలవులు తీసుకున్నాడు. అయితే, తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలైన తర్వాత అతడిలా తిరిగి వచ్చేయడంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు కోచ్‌గా వ్యవహరించిన‌ ఏఎన్‌ శర్మ కూడా కోహ్లీ చేసింది మంచిది కాదంటున్నారు.

"కోహ్లీ స్థానంలో నా శిష్యుడు వీరూ ఉంటే కచ్చితంగా క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వచ్చేవాడు కాదు. కోహ్లీ వంటి ఆటగాడు తిరిగి రావడం నాకు నచ్చలేదు. జట్టుతోనే ఉండి ఆస్ట్రేలియాతో పోరాడాల్సింది."

-ఏఎన్ శర్మ, సెహ్వాగ్ కోచ్

టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ దిలీప్‌ దోషి కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కోహ్లీ స్థానంలో తానుంటే కచ్చితంగా దేశం తరఫున ఆడేందుకే తొలి ప్రాధాన్యం ఇచ్చేవాడినని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆటగాళ్లను ఆపేందుకు బీసీసీఐకి ఎటువంటి అధికారాలు లేవని, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులను తాను అర్థం చేసుకుంటానని అన్నారు. అయితే.. వ్యక్తిగతంగా తాను మాత్రం జట్టుతోనే ఉండేవాడినని స్పష్టం చేశారు.

భారత్‌ ఇప్పటికే తొలి టెస్టులో ఘోరంగా విఫలమైంది. ఆ మ్యాచ్ తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భారత్‌కు చేరుకున్నాడు. ఇక శనివారం నుంచి ప్రారంభమయ్యే ‘బాక్సింగ్‌డే టెస్టు’లో భారత్‌ ఎలా ఆడనుందో వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details