ఒక టెస్టు మ్యాచ్‌లో గెలవాలంటే కచ్చితంగా శతకం చేయాల్సిన పరిస్థితి వస్తే స్టీవ్ స్మిత్ లేదా విరాట్ కోహ్లీని పంపిస్తానని, అంతేకాని తాను మాత్రం వెళ్లనని శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర చెప్పాడు. ప్రస్తుతం మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్న అతడు త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. దీంతో అతడి కోసం ఆ క్రికెట్ క్లబ్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ట్విట్టర్లో క్రికెట్ ప్రేమికులతో ప్రశ్న-జవాబుల సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సంగక్కర పాల్గొని అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు చెప్పాడు.
ఒక టెస్టు మ్యాచ్ గెలవాలంటే శతకం బాదాలి. అందుకు ఒక ఆటగాడు కావాలి. కోహ్లీ, స్మిత్, సంగక్కర. ఈ ముగ్గురిలో ఎవర్ని ఎన్నుకుంటారు?
సంగక్కర:హహహ.. కోహ్లీ లేదా స్మిత్‌నే ఎంచుకుంటా. నేను మాత్రం వెళ్లను.
ఏ పేస్ బౌలర్‌ను ఎదుర్కోడాన్ని మీరు కష్టంగా భావిస్తారు?
సంగక్కర్: వసీం అక్రమ్ అయితే పీడకలే. నేను ఎక్కువ సార్లు ఆడింది జహీర్ బౌలింగ్‌లో. అతడి బంతిని అడ్డుకోవడం అత్యంత కష్టతరం.
ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరుతుందని మీరు అనుకుంటున్నారా? అయితే ఎప్పుడు?
సంగక్కర:ఆ విషయంలో కచ్చితమైన నిర్ణయం ఉంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. ఎంసీసీతో పాటు చాలా క్రికెట్ బోర్డులు దాన్ని నిజం చేయాలని చూస్తున్నాయి.
ఎంసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేశాక ఎంత సంతృప్తి పొందారు?
సంగక్కర: ఈ పదవి ఆస్వాదించదగినది. ఈ చారిత్రక క్లబ్‌లో అత్యుత్తమ స్థాయిలో పనిచేయడం గొప్పగా భావిస్తున్నా.