ఐపీఎల్లో ఆర్సీబీది ప్రత్యేక స్థానం. 2008లో తొలి సీజన్లో అడుగుపెట్టిన ఈ జట్టు మహామహుల చేతిలో నడిచింది. రాహుల్ ద్రవిడ్, అనీల్ కుంబ్లే, కెవిన్ పీటర్సన్, డేనియల్ వెటోరీ, షేన్ వాట్సన్ లాంటి దిగ్గజాలతో ఆర్సీబీ పటిష్టంగా ఉండేది. ఈ ఆటగాళ్లందరికీ వారివారిదేశాల జట్లకు సారథ్య బాధ్యతలు వహించిన అనుభవం ఉంది.
- విరాట్ కోహ్లీ ప్రపంచ అత్యత్తమ ఆటగాడు. ఆర్సీబీ జట్టులో ఎప్పుడూ బలమైన ఆటగాళ్లు ఉంటారు. ఇన్ని సానుకూలతలున్నా ఒక్కసారి కూడా కప్పును సొంతం చేసుకోలేకపోయింది. ఈ విషయంపై ఆర్సీబీ యాప్ ప్రారంభోత్సవంలో కోహ్లీ స్పందించాడు.
ఆర్సీబీ యాప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న విరాట్ కోహ్లీ
' సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేనపుడు కచ్చితంగా ఓడిపోతాం. ఇంత పెద్ద ఆటలో నిర్ణయాలు తీసుకోవడంలో మేము విఫలమవుతున్నాం. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లే జట్లే ఇప్పటివరకు కప్పు గెలిచాయి'
- విరాట్ కోహ్లీ, ఆర్సీబీ సారథి
ఆర్సీబీకి మిగతా జట్లతో పోలిస్తే విపరీతమైన అభిమానులు ఉన్నారు. కోహ్లీ, డివిలియర్స్ లాంటి మేటి ఆటగాళ్ల బ్యాటింగ్ చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఆర్సీబీ అభిమానుల గురించి ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడాడు.
'మూడు సార్లు ఫైనల్కు వెళ్లాం. మరో మూడు సార్లు సెమీ ఫైనల్స్ ఆడాం. కాని కప్పు సాధించలేకపోయాం. మాలో ఆత్మవిశ్వాసం ఎప్పుడూ తగ్గలేదు. సీజన్ మొదటి నుంచి బాగానే ఆడుతున్నాం. మా ప్రదర్శన, ఆటతీరే ఇంతమంది అభిమానులను సంపాదించిపెట్టింది' - విరాట్ కోహ్లీ, ఆర్సీబీ సారథి
ఆర్సీబీ యాప్ అభిమానులందరికి ఒక వేదిక లాంటిది. జట్టుకు సంబంధించిన అన్ని విషయాలు దీనిలోనే వెల్లడిస్తాం అంటూ విరాట్ మాట్లాడాడు. కార్యక్రమానికి శిక్షకుడు గ్యారీ కిర్స్టన్, ఆశిష్ నెహ్రా హాజరయ్యారు.
- ఐపీఎల్ ఈ నెల 23వ తేదీన చెన్నైలో ప్రారంభమవుతోంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైతో ఆర్సీబీ తలపడనుంది. గతంలో బెంగళూరుకు ఆడిన విధ్వంసకర ఆటగాడు గేల్...ఈ ఏడాది పంజాబ్ తరఫున బరిలోకి దిగుతున్నాడు.