తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ స్టార్ ఓపెనర్​గా మారింది ఈరోజే! - రోహిత్ శర్మ

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసి ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ. అలాంటి రికార్డును నాంది పడింది సరిగ్గా ఈరోజే (నవంబర్ 2). 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో తన తొలి ద్విశతకం నమోదు చేశాడు. ఆ తర్వాత మరో రెండు డబుల్స్ సాధించి ఔరా అనిపించాడు.

Rohit Sharma scores first double hundred against Australia on this day
హిట్​మ్యాన్ డబుల్ రికార్డుకు నాంది ఈరోజే

By

Published : Nov 2, 2020, 4:14 PM IST

రోహిత్ శర్మ.. ఈ పేరు వింటే గుర్తొచ్చేది భారీ సిక్సులే. బౌలర్ షార్ట్ పిచ్ బంతి వేశాడంటే అది కాస్తా రోహిత్ బ్యాట్​ను తాకి గాల్లో అలా వెళ్లి బౌండరీ ఆవల పడాల్సిందే. అందుకే అభిమానులు ముద్దుగా అతడిని హిట్​మ్యాన్ అని పిలుచుకుంటారు. ఇతడి ఖాతాలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. మరే ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. ఈ రికార్డుకు నాంది సరిగ్గా ఇదే రోజున (నవంబర్ 2) పడింది. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో తన తొలి ద్విశతకం నమోదు చేశాడు రోహిత్.

సచిన్​తో మొదలు

వన్డేల్లో డబుల్ సెంచరీ అంటే మామూలు విషయం కాదు. ఆ రికార్డు సాధిస్తారని ఎవ్వరూ ఊహించలేదు కూడా. కానీ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్​ పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో తొలి ద్విశతకం బాదాడు. 2010, ఫిబ్రవరి 4న గ్వాలియర్​లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో 200 పరుగులతో నాటౌట్​గా నిలిచి ఈ ఘనత సాధించాడు. దీంతో అందరిచూపు ఈ రికార్డుపై పడింది. ఆ తర్వాత ఏడాదిలోనే భారత జట్టు విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ద్విశతకం సాధించాడు. 2011, డిసెంబర్ 8న ఇండోర్ వేదికగా వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో 219 పరుగులు సాధించి.. పరిమిత ఓవర్ల క్రికెట్​లో అత్యధిక వ్యక్తిగత రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇది ప్రారంభం మాత్రమే.

రోహిత్

రోహిత్ శకం షురూ

ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2013, నవంబర్2న టీమ్​ఇండియా యువ ఓపెనర్ రోహిత్ శర్మ తన బ్యాట్​కు పని చెప్పాడు. ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన వన్డేలో 209 పరుగులు చేసి తన తొలి డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్​లో 16 సిక్సులతో ఓ వన్డేల్లో ఎక్కువ సిక్సులు బాదిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు జూన్, 2019 వరకు రోహిత్ పేరు మీదే ఉంది. 2019 ప్రపంచకప్​లో అఫ్ఘానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 17 సిక్సులు బాది ఈ రికార్డును చెరిపేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. ఈ మ్యాచ్​లో అతడు 71 బంతుల్లో 148 పరుగులు చేశాడు.

అయితే వన్డేల్లో తొలి మూడు డబుల్ సెంచరీలు భారతీయులవే కావడం గమనార్హం. సచిన్, సెహ్వాగ్ ఒక డబుల్ సెంచరీతో సరిపెడితే రోహిత్ మూడు ద్విశతకాలు చేసి ఎవ్వరికి సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి డబుల్ సాధించిన ఏడాదికే 2014లో మరో ద్విశతకం బాదాడు హిట్​మ్యాన్. ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు ఇప్పటికీ రోహిత్ పేరు మీదే ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 13న శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్​లో 208* పరుగులతో నాటౌట్​గా నిలిచి కెరీర్​లో మూడో డబుల్ సాధించాడు హిట్​మ్యాన్.

మొత్తంగా వన్డేల్లో ఇప్పటివరకు 8 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. అందులో రోహిత్​వే మూడు. ఆ తర్వాత సచిన్ (200*), సెహ్వాగ్ (209), గేల్ (215), గప్తిల్ (237*), ఫకర్ జమాన్ (210*) ద్విశతకం చేసిన వారిలో ఉన్నారు..

ABOUT THE AUTHOR

...view details