టీమ్ఇండియాకు కోచ్‌గా అవకాశమిస్తే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు మాజీ క్రికెటర్ అజారుద్దీన్. తాజాగా ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను వెల్లడించాడు.
"అవును, నేను దానికి (కోచ్ పదవి) సిద్ధంగా ఉన్నా. నాకు భారత జట్టుతో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగుతా" అని తెలిపాడు అజారుద్దీన్.
టీమ్ఇండియాకు ప్రస్తుతం కోచ్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి.. టీ20 ప్రపంచకప్ 2021 వరకు ఆ పదవిలో కొనసాగనున్నాడు.
ప్రస్తుత కాలంలో చాలామంది సహాయక సిబ్బంది జట్లతో కలిసి ఎందుకు ప్రయాణిస్తున్నారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు అజారుద్దీన్.
"ఈ రోజుల్లో చాలా మంది సహాయక సిబ్బంది జట్టుతో పాటు రావడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఉదాహరణకు నాకు బ్యాటింగ్, ఫీల్టింగ్‌లో అనుభవం ఉంది. అందువల్ల నేను ఏ జట్టుకైనా కోచ్‌గా వ్యవహరిస్తే, నాకు ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ అవసరం లేదు" అని అజహర్ తెలిపాడు. ఈయన ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.
ఐపీఎల్ యువ క్రికెటర్లకు వరం
కరోనా సంక్షోభం కారణంగా వాయిదా వేసిన ఐపీఎల్ ఈ ఏడాది చివర్లో నిర్వహించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు అజారుద్దీన్. యువ క్రికటర్లకు ఈ లీగ్ ఓ చక్కటి అవకాశమని.. ఈ టోర్నీ లేకపోతే హర్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాళ్లు ఇప్పటికీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పోరాడుతూ ఉండేవారని వెల్లడించాడు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యువక్రికెటర్ వినియోగించుకోవాలని సూచించాడు.
ఇదీ చూడండి... ఎక్స్‌క్లూజివ్: 'ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తా'