టీమ్ఇండియాకు ఆడిన ఆత్మవిశ్వాసంతో వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్ వంటి యువకులు ఆర్‌సీబీ తరఫున అదరగొడతారని ఆ జట్టు సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. భారత్‌కు ఆడటం సైని, సుందర్, సిరాజ్, యూజీ వ్యక్తిత్వాలను మార్చేసిందని పేర్కొన్నాడు. తమ జట్టు సరైన దిశలో పయనించేందుకు, బృందంగా రాణించేందుకు వారి అనుభవం సాయపడుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
"మా కుర్రాళ్లు మరింత ఆత్మవిశ్వాసం, అనుభవం పొందారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరు ప్రభావం చూపగలరని ప్రత్యర్థులకూ తెలుసు. ఇది మాకు శుభసూచిక. ఏదేమైనా చిన్నస్వామిలో ఆడినంత మజా ఉండదు. కానీ ఐపీఎల్ స్వదేశానికి రావడం సానుకూల అంశం. అయితే ఈసారీ ఎవరికీ సొంతమైదాన ప్రయోజనం లేదు. ప్రతి జట్టు తటస్థ వేదికల్లోనే ఆడుతోంది. సొంత బలాలపై ఆధాపడతారు కాబట్టి పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే 3-4 మ్యాచులను కాపాడుకోవాలి. ఇక టోర్నీకి వ్యూయర్‌షిప్ పెరగడం గొప్ప విషయం" అని కోహ్లీ అన్నాడు.