భారత జట్టు కెప్టెన్ కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయని రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. విరాట్, అనుష్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హిట్ మ్యాన్ అన్‌ఫాలో చేయడం వీటికి మరింత ఆజ్యం పోసింది. ఈ విషయంపై యావత్ క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ సందేహం తీరలేదు.
కోహ్లీ, రోహిత్ మధ్య నవ్వుల యుద్ధం - బీసీసీఐ
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఉప సారథి రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయనే వార్తలు ప్రస్తుతం షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై పరోక్షంగా వివరణ ఇస్తూ 'హెడ్స్ అప్ ఛాలెంజ్' పేరుతో ఓ సరదా వీడియోను షేర్ చేసింది బీసీసీఐ.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. కరీబియన్లతో గురువారం తొలి వన్డే ఆడాల్సింది. కానీ వర్షం కారణంగా రద్దయింది. ఆ సమయంలో జట్టు సభ్యులంతా డ్రెస్సింగ్ రూంలో సరదాగా ఆట పాటలతో కాలక్షేపం చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసింది బీసీసీఐ.
రోహిత్ బోర్డు పట్టుకొని పేరు చూపిస్తే, వారిని అనుకరించి చూపాడు రవీంద్ర జడేజా. తొలుత బుమ్రా పేరు వచ్చింది. అతడి బౌలింగ్ యాక్షన్‌ను చేసి చూపించాడు జడ్డూ. టక్కున జస్ప్రీత్ పేరు చెప్పేశాడు రోహిత్. రెండో బోర్డులో కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు వచ్చింది. భారత్ బ్యాట్స్‌మన్ అని చెప్పి... మణికట్టు దగ్గర కోహ్లీ బ్యాట్ సర్దుకునే స్టైల్ అనుకరించి చూపించాడు జడేజా. వెంటనే విరాట్ అని గట్టిగా సమాధానమిచ్చాడు హిట్‌మ్యాన్.
సరైన సమాధానాలు చెప్పినందుకు జడ్డూతో కలిసి ఎగిరి గంతేశాడు రోహిత్ . ఆ పక్కనే ఉన్న కోహ్లీ.. వీరిద్దరి సరదా ఆటను చూసి నవ్వుకున్నాడు.