క్రికెట్లో మన్కడింగ్‌తో చర్చనీయాంశమైన క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. తాజాగా ఓ సంఘటనతో మళ్లీ వార్తల్లో నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్లో భాగంగా ఈనెల 1న కర్ణాటక, తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్యాడ్లు లేకుండా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడీ స్పిన్నర్.
ఇదీ జరిగింది..
మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన తమిళనాడు గట్టిపోటీ ఇచ్చింది. అయితే తమిళ జట్టు ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగో బంతికి సింగిల్ సాధించాడు అశ్విన్. ఇంకా రెండు బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన సమయంలో.. రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు మరో బ్యాట్స్‌మన్ విజయ్‌శంకర్. ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సిన తరుణంలో.. అశ్విన్ ప్యాడ్లు విప్పి కనిపించాడు. రెండు పరుగులు చేస్తే డ్రా అవుతుంది కాబట్టి వేగంగా పరుగెత్తాలని భావించి ఇలా చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఆఖరి బంతికి క్రీజులోకి వచ్చిన మురుగన్ అశ్విన్.. సరిగ్గా హిట్ చేయలేకపోవడం వల్ల సింగిల్ మాత్రమే వచ్చింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఒక్క పరుగు తేడాతో గెలిచింది. 9 బంతుల్లో 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు అశ్విన్. లక్ష్యాన్ని ఛేదించలేక 6 వికెట్లు కోల్పోయి 179 రన్స్‌కే పరిమితమైంది తమిళనాడు జట్టు.
ఇవీ చూడండి.. వెండితెరపై శభాష్ 'మిథాలీ'... నటి ఎవరో తెలుసా..?