అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ముగిశాక దురుసుగా ప్రవర్తించిన ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లతో పాటు ఇద్దరు భారత క్రికెటర్లపై ఐసీసీ సస్పెన్షన్ పాయింట్లు విధించింది. ఇందులో భారత స్టార్ బౌలర్ రవి బిష్ణోయ్ కూడా ఉన్నాడు. ఇతడు టోర్నీలో 17 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పేరుతెచ్చుకున్నాడు. అతడిపై ఐసీసీ శిక్ష వేయడంపై తన కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ విషయంపై బిష్ణోయ్ తండ్రి మంగిలాయ్ బిష్ణోయ్ స్పందించాడు.
"నా కొడుకు ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉంది. మాకున్న నలుగురు పిల్లల్లో బిష్ణోయ్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ప్రత్యర్థి ఆటగాడు తన జట్టుతో ప్రవర్తించిన తీరు వల్లే అతడు సహనం కోల్పోయి ఉంటాడు. ఈ ఘటన జరిగినప్పట్నుంచి నా భార్య సరిగా భోజనం చేయట్లేదు."
-- మంగిలాయ్, యువ క్రికెటర్ బిష్ణోయ్ తండ్రి
మ్యాచ్ అనంతంరం బంగ్లాదేశ్ ఆటగాళ్ల తీరుపై క్షమాపణలు తెలిపాడు ఆ జట్టు సారథి అక్బర్. ఆసియా కప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లు భావించే తమ ఆటగాళ్లు కాస్త ఉద్వేగానికి లోనయ్యారని అభిప్రాయపడ్డాడు.
ఇదీ జరిగింది...!
ప్రపంచకప్ గెలిచాక బంగ్లా క్రికెటర్లు తౌహిద్, షమీమ్, రకీబుల్ హసన్ టీమిండియా కుర్రాళ్ల వైపు దూసుకొస్తూ అసభ్యకర సంజ్ఞలు చేశారు. ఫలితంగా ఆకాశ్ సింగ్, రవి బిష్ణోయ్.. బంగ్లా ఆటగాళ్లతో తలపడినంత పని చేశారు. క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించిన ఆకాశ్‌కు 8, బిష్ణోయ్‌కి 5, తౌహిద్‌కు 10, షమీమ్‌కు 8, రకీబుల్‌కు 4 చొప్పున సస్పెన్షన్ పాయింట్లు విధించినట్లు ఐసీసీ తెలిపింది. ఒక సస్పెన్షన్ పాయింట్ పొందిన ఆటగాడు ఒక వన్డే లేదా టీ20, లేదా అండర్-19 లేదా ఏ-జట్ల తరఫున మ్యాచ్ ఆడేందుకు అనర్హుడవుతాడు. ఈ శిక్ష ప్రకారం బిష్ణోయ్ 5 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.