తెలంగాణ

telangana

ETV Bharat / sports

వీడ్కోలుపై ప్రధాని మోదీ లేఖకు 'మిస్టర్​కూల్​' స్పందనిదే.. - modi, dhoni letter news

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ.. భారత క్రికెట్​లో చేసిన సేవలను ప్రశంసించారు ప్రధాని మోదీ. ఈ మేరకు మహీ వీడ్కోలును ప్రస్తావిస్తూ ఓ లేఖ రాశారు. దాన్ని ట్విట్టర్​లో అభిమానులతో పంచుకున్న మహీ.. తనదైన రీతిలో సమాధానమిచ్చాడు.

pm modi appreciation letter to dhoni
వీడ్కోలుపై ప్రధాని మోదీ లేఖకు 'మిస్టర్​కూల్​' స్పందనిదే..

By

Published : Aug 20, 2020, 3:21 PM IST

Updated : Aug 20, 2020, 4:48 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంపై.. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ మహీకి ఓ లేఖ రాశారు. ధోనీ ప్రకటించిన రిటైర్మెంట్ గురించి దేశం మొత్తం చర్చించుకుందని మోదీ అభిప్రాయపడ్డారు. భారత క్రికెట్​లో మహీ సేవలను మెచ్చుకున్న ప్రధాని.. సైన్యంలోనూ పనిచేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు.

ప్రధాని రాసిన లేఖ.. ఆయన మాటల్లోనే

"ఎవరూ ఊహించని విధంగా మీ స్టైల్లోనే ఆగస్టు 15న ఒక చిన్న వీడియోతో రిటైర్మెంట్‌ ప్రకటించి దీర్ఘకాలంగా నడుస్తున్న ఒక చర్చకు తెరదించారు. ఈ నిర్ణయం 130 కోట్ల మందిని బాధించినా 15 ఏళ్లుగా భారత క్రికెట్‌కు మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు.

టీమ్‌ఇండియాకే మీరు అతి గొప్ప సారథి. మీ కెప్టెన్సీతో జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అలాగే ఒక బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌కీపర్‌గా మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. కష్ట సమయాల్లో మీరున్నారనే భరోసా, మ్యాచ్‌ను గెలిపిస్తారనే ధీమా ఈ భారతావని ఎప్పటికీ మర్చిపోదు. మరీ ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌ సాధించిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో నిలిచిపోతుంది. అలాగే మహేంద్రసింగ్‌ ధోనీ అనే పేరు కేవలం గణంకాలకో లేక కొన్ని మ్యాచ్‌ల విజయాల వరకే పరిమితం కాదు. అదెప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది. మిమల్ని ఒక క్రీడాకారుడిగా చూడటం కూడా సరైంది కాదు. మిమ్మల్ని అంచనా వేయాలంటే మాటలు సరిపోవు. చిన్న పట్టణం నుంచి వచ్చి దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. మీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అన్నిటికన్నా ముఖ్యం దేశాన్ని గర్వపడేలా చేశారు. మీ పనితీరుతో కోట్లాదిమంది యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. కొత్త భారతావనికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. ఇంటిపేరు లేకుండానే మీకంటూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.

మన ప్రయాణం ఎటువైపు వెళ్తుందనే విషయం తెలిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అవసరం లేదు. ఇదే స్ఫూర్తి మీరు ఎంతో మంది యువతలో రగిలించారు. ఈ క్రమంలో నేటి యువతరం కష్టాలను చూసి జడిసిపోదు. తోటివారిని ప్రోత్సహిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తుంది. అందుకు.. మీరు సాధించిన 2007 టీ20 ప్రపంచకప్పే అసలైన ఉదాహరణ. కష్ట సమయాల్లో మీరు జట్టు నడిపించిన తీరే వారికి ప్రేరణ. ఇక మీ కేశాలంకరణతో ఎలా కనిపించినా గెలుపోటములను సమానంగా స్వీకరించే లక్షణం ఎంతో మందికి ఒక పాఠంలా నిలుస్తుంది. ఇక మీరు భద్రతా దళాల్లో చేసిన సేవలు అమోఘం. మన సైనికులతో కలిసి పనిచేయడానికి ఎంతో సంతోషంగా ముందుకొచ్చారు. వాళ్ల మంచికోసం మీరు పడే తపన ఎప్పటికీ గుర్తుండిపోతుంది"

-- ప్రధాని నరేంద్ర మోదీ

చివరగా సాక్షి, జీవాపై స్పందించిన మోదీ.. ఇప్పుడు వారు ధోనీతో అధిక సమయం గడుపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాళ్లకి తన అభినందనలు తెలిపారు. వాళ్ల త్యాగాలు, మద్దతు లేకపోతే ఏదీ సాధ్యమయ్యేది కాదన్నారు. అలాగే అటు ప్రొఫెషనల్‌, ఇటు వ్యక్తిగత జీవితం.. రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలనే విషయంలోనూ ధోనీని చూసి నేర్చుకోవచ్చని యువతరానికి ప్రధాని సూచించారు. మాజీ సారథి ఒక మ్యాచ్‌లో విజయం సాధించాక తన కూతురు జీవాతో ఆడుకోవడం చూశానని, అది ఎప్పటికీ తనకు గుర్తుండిపోతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇకపై మాజీ సారథి భవిష్యత్తు బాగుండాలని ఆశించారు.

ధోనీ స్పందనిదే...

మోదీ లేఖను ట్విట్టర్​లో అభిమానులతో పంచుకున్న మహీ.. తన స్పందనను తెలియజేశాడు.

"ప్రతి కళాకారుడు, సైనికుడు, క్రీడాకారుడు పరితపించేది ప్రశంసల కోసమే. వారి కష్టం, త్యాగాలను గుర్తించి అందరి మెచ్చుకోవాలని భావిస్తారు. మీ ప్రశంసలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు ప్రధాని మోదీ" అంటూ మహీ సమాధానమిచ్చాడు.

Last Updated : Aug 20, 2020, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details