గులాబి.. గులాబి.. గులాబి..! ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ! వన్డేలు, టీ20లంటే తెలుపు బంతి.. టెస్టులంటే ఎరుపు బంతి.. ఎన్నో ఏళ్లుగా అలవాటైపోయిన విషయమిది! కానీ ఇప్పుడు భారత్ ఆడబోయే తొలి డే/నైట్ టెస్టులో గులాబి బంతి వినియోగిస్తారనేసరికి.. ‘ఎందుకలా?’ అనే ప్రశ్న వచ్చింది. ఆ రంగే ఎందుకు? తెలుపు, ఎరుపు బంతులతో పోలిస్తే అందులో కొత్తదనమేంటి? అదెలా స్పందిస్తుంది? క్రికెటర్లు దానికి ఎలా అలవాటు పడతారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలీ గులాబి బంతిని ఎలా తయారు చేస్తారు? దీని ప్రత్యేకతలేంటో చూద్దాం.
చేతి మహిమ
భారత్‌లో ఆడే టెస్టు మ్యాచ్‌లకు ఎస్జీ సంస్థ బంతులనే ఉపయోగిస్తారు. విదేశాల్లో ఎక్కువగా కూకాబుర్రా బంతులు వినియోగంలో ఉన్నాయి. వాటిని పూర్తిగా యంత్రాలతో తయారు చేస్తారు. కానీ ఎస్జీ బంతులకు అక్కడక్కడా కొద్దిగానే యంత్రాల వినియోగం ఉంటుంది. కార్క్, ఉన్ని కలిసిన మిశ్రమంతో బంతి అంతర్భాగాన్ని తయారు చేయడం.. తోలు కత్తిరించడం.. బంతిని దారంతో కుట్టడం అన్నీ మనుషులే చేస్తారు. సీమ్ దారాన్ని చేత్తో కుట్టడం వల్ల స్పిన్నర్లకు బంతి మీద బాగా పట్టు చిక్కి తిప్పడానికి, బౌన్స్ రాబట్టడానికి అవకాశముంటుంది. అంతేకాక సీమ్ ఎక్కువ సమయం (దాదాపు 45-50 ఓవర్లు) నిలిచి ఉంటుంది.
సీమ్‌లో ఏముంది
ఎరుపు బంతితో పోలిస్తే గులాబిలో సీమ్ పరంగా వైవిధ్యం ఉంటుంది. ఎరుపు బంతిలో పూర్తిగా సింథటిక్ దారాన్ని వాడతారు. గులాబీలో సింథటిక్‌తో పాటు లెనిన్ దారం ఉపయోగిస్తారు. ఇందుకు కారణం ఉంది. ఎరుపు బంతితో పగటి పూట మాత్రమే ఆట సాగుతుంది కాబట్టి సింథటిక్ దారంతో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ గులాబి బంతితో సగం ఆట రాత్రి పూట సాగుతుంది కాబట్టి.. మంచు ప్రభావం ఉన్నపుడు సింథటిక్ దారంతో ఉన్న సీమ్ వల్ల బంతిపై పట్టు చిక్కదు. అందులో లెనిన్ దారం తడిని పీల్చుకోవడం వల్ల బౌలర్లకు ఇబ్బంది ఉండదు. ఇక ఎరుపు బంతిలో సీమ్ దారం తెలుపు రంగుతో ఉంటుంది. గులాబీపై అది వేస్తే సరిగా కనిపించడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. వేరే రంగులు కొన్ని ప్రయత్నించి.. చివరికి నలుపు రంగు దారాన్ని ఖరారు చేశారు. సీమ్ మన్నికపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అది కాస్త దళసరిగా ఉండేట్లు చూస్తున్నారు. కాబట్టి బౌలర్లు దీన్ని ఉపయోగించుకుని స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను మరింత ఇబ్బంది పెట్టే అవకాశముంది.
బౌలర్లకు పండగే
గులాబి బంతి ఎక్కువ స్వింగ్ అవడానికి.. దానికి వేసే పీయూ కోట్ ఓ ముఖ్య కారణం. ఎరుపు బంతిలో లెదర్ మీద మైనం పూస్తారు. ఆట సాగే కొద్దీ దాన్ని బంతి ఇముడ్చుకుంటుంది. బంతి రంగు కొంచెం మారుతుంది. ఆ సమయంలోనే బౌలర్లు బంతిని ఒక వైపు బాగా రుద్ది.. రివర్స్ స్వింగ్‌కు ప్రయత్నిస్తారు. అయితే గులాబి బంతి మీద మైనం పూస్తే కొన్ని ఓవర్ల తర్వాత బంతి నలుపు రంగులోకి మారి బ్యాట్స్‌మెన్‌కు సరిగా కనిపించట్లేదని తేలింది. అందువల్ల దీనిపై మైనం బదులు పీయూ కోట్ అనే పాలిష్ రంగును వేస్తున్నారు. దీని వల్ల కనీసం 40 ఓవర్ల పాటు బంతి రంగు మారదు. బంతి మీద అదనపు లేయర్‌లా ఉండే ఈ పాలిష్ వల్ల బంతి మరింతగా స్వింగ్ అవడమే కాక.. వేగమూ పెరుగుతుంది.