కుటుంబంతో సమయం గడపాలని షోయబ్ మాలిక్ చేసిన అభ్యర్థనను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంగీకరించింది. ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్ కోసం అతడు ఆలస్యంగా జట్టులో చేరనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో ఉన్న తన భార్య సానియా మీర్జా, కుమారుడిని ఐదు నెలలుగా కలవలేదని.. ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్‌కు ముందు కొంత సమయం ఇవ్వాలని షోయబ్ అభ్యర్థించగా బోర్డు సానుకూలంగా స్పందించింది. పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిమ్‌ఖాన్ మాట్లాడుతూ.. 'షోయబ్ మాలిక్ దాదాపు ఐదు నెలలుగా తన కుటుంబాన్ని చూడలేదు. ప్రయాణాలపై ప్రస్తుతం ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. మానవతా దృక్పథంతో షోయబ్ అభ్యర్థనను గౌరవించి కుటుంబాన్ని కలిసే అవకాశం కల్పిస్తున్నాం' అని పేర్కొన్నారు. జులై 24న మాలిక్ భారత్ పంపేందుకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో మాట్లాడినట్లు పీసీబీ తెలిపింది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మాలిక్ (38) 2015లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ తర్వాత గతేడాది వన్డేల నుంచి తప్పుకొన్నాడు. ప్రస్తుతం టీ20ల్లో కొనసాగుతున్నాడు.