టీమ్ఇండియా కీపర్ రిషబ్ పంత్.. వికెట్ కీపింగ్‌లో తన లోపాలను బయటపెడుతూనే ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి రోజు, ఒకే బ్యాట్స్‌మన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లు జారవిడిచి నిరాశపరిచాడు. ఫలితంగా ఆస్ట్రేలియా యువ ఆటగాడు విల్ పకోస్కీ అర్ధశతకం సాధించాడు. దీంతో విసిగిపోయిన నెటిజన్లు ట్విట్టర్లో అతడిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
22వ ఓవర్లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతి.. పకోస్కీ బ్యాట్ అంచున తాకి నేరుగా పంత్ వైపు వెళ్లింది. చేతుల్లోకి వచ్చిన బాల్‌ను అందుకోలేకపోయాడు. దీంతో అతడి వైపు అసంతృప్తిగా చూశాడు అశ్విన్.
సరిగ్గా నాలుగు ఓవర్ల తర్వాత పేసర్ సిరాజ్ బౌన్సర్‌కు తికమకపడిన పకోస్కీ.. బాల్‌ను గాల్లోకి లేపాడు. తొలుత పంత్ క్యాచ్ పట్టాడనుకొని అంపైర్లు ఔటిచ్చారు. కానీ బంతి నేలను తాకిన తర్వాత చేతుల్లోకి తీసుకున్నాడని తేలింది. దీంతో బ్యాట్స్‌మన్‌కు మరోసారి అదృష్టం కలిసొచ్చింది. పకోస్కీ, లబుషేన్‌ల అర్ధశతకాలు చేయడం వల్ల తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 166/2తో నిలిచింది ఆసీస్.