శ్రీలంకతో టీ20 సిరీస్‌లో తన ప్రదర్శన గురించి వస్తోన్న విమర్శలపై స్పందించాడు పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజమ్. ఇటీవలే టీ20 ఫార్మాట్‌కు సారథిగా మారిన ఈ క్రికెటర్.. రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌ను సవాల్‌గా తీసుకుంటానని చెప్పాడు. ఈ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఆదర్శమని అన్నాడు.
"మూడు మ్యాచ్‌ల్లో నా ప్రదర్శన చూసి నా ఆట తీరుపై ఓ అవగాహనకు ఎలా వస్తారో తెలియట్లేదు. నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాను కాబట్టి ఆడలేకపోయననడంలో అర్థం లేదు. క్రికెట్లో ఇలాంటివి సరికాదు. ప్రతి మ్యాచ్‌లో వంద శాతం ఆడేందుకే ప్రయత్నిస్తా. కెరీర్లో ఒడుదొడుకులు సహజం. ఇప్పుడు కెప్టెన్ అయినంత మాత్రాన నాపై ఒత్తిడేమి ఉండదు. నా ఆటను నేను ఆడతా, మంచి ప్రదర్శన చేస్తా" - బాబర్ అజమ్, పాక్ టీ20 కెప్టెన్.
కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ తనకు ఆదర్శమని చెప్పాడు బాబర్.