తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒక్క సెంచరీతో రోహిత్ రెండు ప్రపంచ రికార్డులు

వన్డే ప్రపంచకప్​లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ శతకాల ఘనతకు ఏడాది పూర్తయింది. ఓ సీజన్​లో​ అత్యధికంగా ఐదు సెంచరీలు చేసి, ఎవరికీ సాధ్యం కాని రికార్డును సృష్టించాడు హిట్​మ్యాన్.

ఒక్క సెంచరీతో రోహిత్ రెండు ప్రపంచ రికార్డులు
ఓపెనర్ రోహిత్ శర్మ

By

Published : Jul 2, 2020, 5:14 PM IST

టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ.. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో మెరిసిపోయాడు. దీంతో మెగాటోర్నీ చరిత్రలో ఓ సీజన్‌లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్​మన్​గా చరిత్ర సృష్టించాడు. భారత జట్టులో అంతకుముందు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ.. 2003లో మూడు శతకాలతో చెలరేగాడు. ఆ తర్వాత భారత్‌ తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించింది రోహిత్‌శర్మనే.. ఆ రికార్డు నెలకొల్పి నేటికి ఏడాది పూర్తయింది.

స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ

2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇదే రోజు బర్మింగ్‌హామ్‌లో మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు సహరించే పిచ్‌పై 314/9 మంచి స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(104), కేఎల్‌ రాహుల్‌ (77) ధాటిగా ఆడి శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 180 పరుగులు జోడించారు. ఆది నుంచి దూకుడుగా ఆడిన రోహిత్‌.. బంగ్లా బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. రోహిత్‌ సెంచరీ తర్వాత ఔటయ్యాక భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో చివరికి 314 స్కోరు చేసింది. ముస్తాఫిజుర్ 5 వికెట్లతో రాణించాడు. అనంతరం ఛేదనలో బంగ్లాను భారత బౌలర్లు 286 పరుగులకే కట్టడి చేశారు. బుమ్రా 4, హార్దిక్‌ పాండ్య 3 వికెట్లతో చెలరేగడం వల్ల బంగ్లాదేశ్‌ ఆలౌటైంది. షకిబ్‌ అల్‌ హసన్‌(66) బాగా ఆడినా అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ కరవయ్యారు. దీంతో ఆ జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్​ ఫొటో

ఈ మ్యాచ్‌ కన్నా ముందే రోహిత్‌ ఆతిథ్య ఇంగ్లాండ్‌పై శతకంతో చెలరేగాడు. దాంతో 16 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా గంగూలీ సరసన చేరాడు. దాదా 2003 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాలో మూడు శతకాలు సాధించాడు. మరోవైపు రోహిత్‌ ఇదే శతకంతో శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర రికార్డును సమం చేశాడు. 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో లంక మాజీ బ్యాట్స్‌మన్‌ నాలుగు శతకాలతో చెలరేగిపోయి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో రోహిత్‌ బంగ్లాపై సెంచరీ సాధించి ఒకే ఇన్నింగ్స్‌తో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. అనంతరం శ్రీలంకతో ఆడిన తర్వాతి మ్యాచ్‌లోనూ రోహిత్‌(103) మరో సెంచరీ బాదడం వల్ల ఓ ప్రపంచకప్‌లో అత్యధికంగా ఐదు శతకాలు బాదిన క్రికెటర్‌గా ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు

ABOUT THE AUTHOR

...view details