2007 తొలి టీ20 ప్రపంచకప్ ఉత్కంఠభరిత ఫైనల్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన టీమ్‌ఇండియా కప్పును ముద్దాడింది. అంతకు ముందే చిరకాల ప్రత్యర్థితో లీగ్ దశలో తలపడింది. అప్పుడు మ్యాచ్ టైగా మారడం వల్ల అంపైర్లు బౌలౌట్ విధానాన్ని అవలంభించి ధోనీసేనను విజేతగా ప్రకటించారు. అయితే ఆ మ్యాచ్ కన్నా ముందే నాటి బౌలింగ్ కోచ్, మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తమ ఆటగాళ్లకు బౌలౌట్ విధానాన్ని ప్రాక్టీస్ చేయించాడని సీనియర్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వీటితో పాటే పలు విషయాల్ని చెప్పాడు.
'రోజూ మేం ప్రాక్టీస్ చేసేటప్పుడు వెంకీ మమ్మల్ని ఫుట్‌బాల్ ఆడనీయకుండా బౌలౌట్ చేయించేవాడు. బ్యాట్స్‌మెన్‌లో నేనూ, సెహ్వాగ్, రోహిత్ నేరుగా స్టంప్స్‌కు విసిరేవాళ్లం. ఆ క్రమంలోనే పాకిస్థాన్‌తో ఆడిన తొలి టీ20 టైగా మారింది. అప్పుడు మేమెంతో ఆసక్తితో ఎదురుచూశాం. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయే పరిస్థితికి చేరుకుంది. చివర్లో శ్రీశాంత్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్ల మ్యాచ్‌ను టైగా ముగించాం. తర్వాత పూర్తి ఆత్మవిశ్వాసంతో బౌలౌట్ విధానానికి సిద్ధపడ్డాం. నేను బౌలౌట్‌కు వెళతానని అనగానే కెప్టెన్ ధోనీ ఒప్పేసుకున్నాడు. ఈ విషయంలో అతడికి క్రెడిట్ ఇవ్వాలి. అసలు బౌలరే కాని ఓ ఆటగాడు నేరుగా కెప్టెన్ వద్దకెళ్లి బౌలౌట్ చేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ, ఒట్టేసి చెబుతున్నా.. ధోనీ కనురెప్ప కూడా వేయకుండా ఓకే అన్నాడు'