ఇన్నింగ్స్‌లో ఓ బౌలర్ అయిదు వికెట్లు పడగొడితేనే గొప్పగా భావిస్తారు. అలాంటిది ఏకంగా పది వికెట్లు పడగొడితే? అలా సాధించడం చాలా అరుదు. అయితే భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. అయితే కుంబ్లే ఈ రికార్డు నెలకొల్పి సరిగ్గా నేటికి 21 సంవత్సరాలు. ఫలితంగా ఐసీసీ ఈ చారిత్రక రోజును గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. 1999 ఫిబ్రవరి 7న ఈ రికార్డు నమోదైంది. "26.3-9-74-10.. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన రెండో బౌలర్ అనిల్ కుంబ్లే" అని ట్వీటింది.
పాకిస్థాన్‌కు షాక్
కార్గిల్ యుద్ధానికి ముందు 1999 ఫిబ్రవరిలో భారత పర్యటనకు పాకిస్థాన్ వచ్చింది. రెండు టెస్టుల సిరీస్‌లో చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది. సిరీస్‌ను కాపాడుకోవాలంటే దిల్లీ వేదికగా జరగాల్సిన రెండో టెస్టులో భారత్ తప్పక గెలవాలి. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా... 252 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో కుంబ్లే (4/75), హర్భజన్ (3/30) ధాటికి 172 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం 80 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా 339 పరుగులు చేసి పాక్ ముందు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే కుంబ్లే (10/74) దెబ్బకి పాక్ కుదేలై రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకే చాపచుట్టేసింది. పాక్ బ్యాట్స్‌మెన్ అందరినీ వరుసగా పెవిలియన్‌కు పంపిస్తూ కుంబ్లే.. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడి తర్వాత ఈ ఘనత ఇప్పటివరకు ఎవరూ అందుకోలేదు.