తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇతర క్రీడాకారులకంటే క్రికెటర్లకే గుర్తింపు ఎక్కువ' - sports persons

ఇతర క్రీడాకారుల కంటే క్రికెటర్లకు ఎక్కువ వ్యక్తిగత గుర్తింపు వస్తుందని అభిప్రాయపడ్డాడు వీరేంద్ర సెహ్వాగ్. అథ్లెట్లకు సరైన సదుపాయాలు కూడా అందడంలేదని చెప్పాడు. క్రికెట్ ఈవెంట్ల కంటే ఒలింపిక్స్, కామన్​వెల్త్​ క్రీడల వేడుకలు భారీగా నిర్వహిస్తారని తెలిపాడు.

సెహ్వాగ్

By

Published : Aug 29, 2019, 9:20 PM IST

Updated : Sep 28, 2019, 7:14 PM IST

భారత్​లో క్రికెట్​కున్న క్రేజ్ మరో క్రీడకు లేదన్నది ఎవరూ కాదనలేని సత్యం. క్రికెట్ వస్తుందంటే పనులు పక్కన పెట్టి మరి చూస్తారు చాలామంది. అయితే క్రికెట్ వేడుకల​ కంటే ఒలింపిక్స్​, కామన్​వెల్త్​ టోర్నీలు భారీగా నిర్వహిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అయితే వ్యక్తిగత గుర్తింపు క్రికెటర్లకు వచ్చినట్లు మిగతా క్రీడాకారులకు రావడం లేదన్నాడు.

"క్రికెట్ వేడుకల కంటే ఒలింపిక్స్​, కామన్​వెల్త్​ క్రీడల కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తారు. అథ్లెట్లకు మంచి సదుపాయాలుంటాయని, వారికి సరైన పౌష్టికాహారం, నైపుణ్యంగల శిక్షకులు ఉంటారని అనుకునేవాడిని. కానీ వారిని (ఇతర క్రీడాకారులు) కలిసి మాట్లాడినపుడు ఇవేమి అందడం లేదని తెలిసింది. దేశానికి పతకాలు తీసుకొస్తున్నప్పటికీ మేము (క్రికెటర్లు) అందుకునే సౌకర్యాల్లో 10 శాతం కూడా వాళ్లు అనుభవించట్లేదు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది" -వీరేంద్ర సెహ్వాగ్, మాజీ భారత క్రికెటర్​

ముంబయిలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ క్రికెట్​ కోచ్​లకూ సరైన గుర్తింపు అందడం లేదని తెలిపాడు.

"క్రికెటర్ల కెరీర్​లో కోచ్​లు ముఖ్య పాత్ర పోషిస్తారు. కానీ వారికీ సరైన గుర్తింపు దక్కడం లేదు. జాతీయ జట్టులో ఎంపికైన తర్వాత చాలా మంది క్రికెటర్లు తమ కోచ్​లను మర్చిపోతున్నారు. ఎందుకంటే వారిని కలిసి మాట్లాడే అవకాశం వారికి ఉండదు. కానీ ఇతర క్రీడల్లో ఆరంభం నుంచి అంతం వరకు కోచ్​ల అవసరం ఉంది. వాళ్లు ఎక్కువ సమయం క్రీడాకారుల కోసమే ఖర్చుపెడతారు" -వీరేంద్ర సెహ్వాగ్​

1999 నుంచి 2013 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు సెహ్వాగ్. 104 టెస్టులు, 251 వన్డేలు ఆడాడు.

ఇది చదవండి: 'హాకీ దిగ్గజానికి భారతరత్న ఎప్పుడిస్తారో'

Last Updated : Sep 28, 2019, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details