మొతేరా పిచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొందరు క్రికెట్ మాజీలు సదరు పిచ్ టెస్టు మ్యాచ్‌లకు పనికి రాదంటూ విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ఆ విషయంపై పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. తాజాగా మరో ఇంగ్లాండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ మాత్రం సరదాగా స్పందించాడు.
"ఏ పిచ్‌పై ఆడుతున్నామన్నది అసలు పట్టించుకోను. డై/నైట్ టెస్టు గురించి పెద్దగా ఫిర్యాదు చేయాల్సిన విషయమేమీ లేదు. నా వరకైతే ఉన్న సమస్య మాత్రం గ్రౌండ్లో వై-ఫై సరిగా రావట్లేదు. కౌంటీల్లో నేను తొలిసారి ససెక్స్ జట్టుకు ఆడాను. ఈ మ్యాచ్‌లో లీసెస్టర్ షైర్ను ఓడించాం. ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లాండ్‌లోనూ మ్యాచ్‌లు త్వరగానే ముగిశాయనేది గుర్తుంచుకోవాలి."
-జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ క్రికెటర్.
'నిజాయితీగా చెప్తున్నా. మేము ఉన్నది భారత్‌లో. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు సహకరిస్తాయని తెలుసు. అంటే ఇక్కడ బ్యాటింగ్ చేయడం కష్టమనే కదా అర్థం" అని ఆర్చర్ అభిప్రాయపడ్డాడు.
రూట్ మాలో స్ఫూర్తి నింపాడు..
మూడో టెస్టు సందర్భంగా తమ జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ.. కెప్టెన్ జో రూట్ తమలో స్ఫూర్తిని నింపాడని ఆర్చర్ పేర్కొన్నాడు. "డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్, అక్షర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. ఇది గమనించిన మా సారథి రెండో ఇన్నింగ్స్‌కు ముందు మాతో మాట్లాడాడు. నిర్భయంగా ఆడాలని సూచించాడు. మనమేమీ ఓడిపోమని మాలో ధైర్యం నింపాడు. మిగిలిన మ్యాచ్‌లకు కూడా ఇదే ధోరణితో ఉండాలని చెప్పాడు" అని తమ నాయకుడి గురించి చెప్పుకొచ్చాడు ఆర్చర్.
ఇదీ చదవండి:'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'కు పెట్రోల్ బహుమతి