నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ను నిర్వహించాలనే ఐసీసీ ప్రతిపాదనను ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాడు. దీనివల్ల సంప్రదాయ ఐదు రోజుల క్రికెట్ పవిత్రతను హరించినట్లేనని అభిప్రాయపడ్డాడు.
"పింక్ బంతి టెస్టుతో సంప్రదాయ టెస్టులో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఈ విధానంతో వాణిజ్యపరంగా ఓ ముందడుగు పడినట్లయింది. టెస్టుల పట్ల ఉత్కంఠను, ఆసక్తిని కలగజేసింది. అయితే నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను మాత్రం నేను వ్యతిరేకిస్తా. పూర్తిగా వినోదం కోసమే మ్యాచ్‌లు నిర్వహిస్తే.. భవిష్యత్తులో మూడు రోజుల టెస్టు గురించి చర్చించాల్సి ఉంటుంది. ఇలాగే కొనసాగితే టెస్టు ఫార్మాట్ కనుమరుగవుతుంది." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
క్రికెట్లో ఇప్పటికే ఎన్నో మార్పు వచ్చాయని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
"టెస్టు క్రికెట్లో రోజులను కుదించడం అంత సమంజసం కాదని నేను అనుకుంటున్నా. అలా చేస్తే 5 రోజుల ఫార్మాట్ పవిత్రతను దెబ్బతీసినట్లే. ఇప్పటికే టీ20 క్రికెట్‌తో కొత్త ఫార్మాట్ వచ్చింది. ఇటీవలే 100 రోజుల ఆట గురించి ఎవరో నన్ను అడిగారు. అందులో నేను ఆడనని చెప్పేశా. ఎందుకంటే క్రికెట్లో ఇప్పటికే ఎన్నో మార్పులు వచ్చాయి" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
2023 నుంచి 2031 వరకు 4 రోజుల టెస్టు మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ఈ అంశంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
ప్రస్తుతం శ్రీలంకతో ఆదివారం నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు కోహ్లీ. గుహవటి వేదికగా శ్రీలంకతో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నెల 7న ఇండోర్‌లో రెండో టీ20 జరగనుంది. ఈ నెల 10న పుణె వేదికగా ఆఖరి టీ20 నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: 40 బంతులు ఒక్క పరుగు.. అందుకే 'ద వాల్' అయ్యాడు!