తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అతనికిస్తే బాగుండేది'

టీమిండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా, వ్యాఖ్యాత సంజయ్​ మంజ్రేకర్​ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర సంభాషణ జరిగింది. న్యూజిలాండ్​పై జరిగిన రెండో టీ20లో 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​' గురించి వీరిద్దరి మధ్య ట్విట్టర్​లో చర్చ సాగింది.

By

Published : Jan 27, 2020, 9:42 PM IST

Updated : Feb 28, 2020, 4:49 AM IST

New Zealand vs India: Sanjay Manjrekar's Response To Ravindra Jadeja's Question On Twitter Leaves Fans Fuming
"మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అతనికిస్తే బాగుండేది"

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌ మధ్య ఏ సంభాషణ జరిగినా క్రికెట్‌ అభిమానులకు ఆసక్తే. ఎందుకంటే ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ట్రెండింగ్‌గా మారింది. అయితే ట్విట్టర్‌లో వీరిద్దరి సంభాషణ మరోసారి వైరల్‌గా మారింది. కాకపోతే ఈ సారి ఎవరూ ఎవరిని విమర్శించుకోలేదు.

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' కేఎల్‌ రాహుల్‌కు కాకుండా.. కివీస్‌ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసిన బౌలర్లకు ఇవ్వాల్సిందని సంజయ్‌ ట్వీట్‌ చేశాడు. అయితే దీనికి జడేజా సరదాగా బదులిచ్చాడు. ఎవరికి ఇవ్వాలని భావిస్తున్నావని జడేజా ట్విట్టర్​లో అడిగాడు. దీనికి సంజయ్‌.. "హహ్హా.. నీకు లేదా బుమ్రాకి. కాదు బుమ్రాకే. ఎందుకంటే అతడు ఎంతో పొదుపుగా బౌలింగ్ చేశాడు. 3,10,18, 20వ కీలక ఓవర్లు బౌలింగ్‌ చేసి కివీస్‌ను కట్టడి చేశాడు" అంటూ సమాధానమిచ్చాడు.

కివీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆతిథ్య జట్టును టీమిండియా 132 పరుగులకే కట్టడి చేయడంలో జడేజా (4-0-18-2), బుమ్రా (4-0-21-1) కీలకపాత్ర పోషించారు. అయితే ప్రపంచకప్‌ సమయంలో నోరుపారేసుకున్న సంజయ్‌ను ఇంకా జడేజా వదిలిపెట్టట్లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. "అడపా దడపా ఆడే జడేజా లాంటి క్రికెటర్లకు నేను అభిమాని కాదు" అని పేర్కొన్న మంజ్రేకర్‌కు గతంలో జడేజా తనదైన రీతిలో సమాధానమిచ్చాడు. "నీకంటే రెండింతలు ఎక్కువ క్రికెట్‌ ఆడాను, ఇంకా ఆడుతున్నాను. ఇతరులను గౌరవించడం నేర్చుకో. నువ్వేదో నోరు జారావని తెలిసింది" అని జడ్డూ ఘాటుగా స్పందించాడు. ఆ తర్వాత సెమీస్‌లో న్యూజిలాండ్‌పై జడేజా గొప్పగా పోరాడటం వల్ల తన మాటలు తప్పని మంజ్రేకర్‌ ఒప్పుకున్నాడు.

ఇదీ చూడండి..'గల్లీ క్రికెటర్​కు క్షమాపణ చెప్పు'

Last Updated : Feb 28, 2020, 4:49 AM IST

ABOUT THE AUTHOR

...view details