భారత్ క్రికెట్లో ఇటీవలే గులాబి బంతితో టెస్టు చూశాం. అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా టెస్టుల్లో జెర్సీలపై నంబర్లూ చూశాం. ఎంతో కొత్తగా అనిపించింది. మరి పురుషులు, మహిళలు క్రికెట్ ఆడితే బావుంటుందని కొందరు అంటే, సూపర్ సిరీస్ అని మరో ఆలోచనను తీసుకొచ్చాడు గంగూలీ. మరి అవి వార్తల్లో వచ్చినా అమల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలాంటి తరహాలో వినడానికి కాస్త వినూత్నంగా, అమలు చేస్తే ఏం జరుగుతుందా అని ఆసక్తిగా అనిపించే కొన్ని విషయాలు.. కనీసం ఈ ఏడాదిలో అయినా ఆమోదం పొందుతాయేమో చూడాలి.
1. గంగూలీ 'సూపర్ సిరీస్'...
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ 'వన్డే సూపర్ సిరీస్' అనే సరికొత్త ఆలోచనలో ముందుకొచ్చాడు. ఇందులో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు మరో దేశంతో కలిపి 2021 నుంచి ప్రతి ఏటా "నాలుగు దేశాల టోర్నీ" ఆడాలన్నది దాదా ప్రతిపాదన. దీనిపై ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు ప్రతిపాదనలు పంపాడు గంగూలీ. ఇవన్నీ ఈ ఏడాది ఓకే అయితే 2021లో మ్యాచ్‌ల నిర్వహణకు ముందడుగు పడనుంది.
2. బీసీసీఐ రాజ్యాంగంలో మార్పులు...
భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరభ్ గంగూలీ... 2019లో జరిగిన తొలి సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్)లో బీసీసీఐ రాజ్యాంగ్యంలో కొన్ని మార్పులు సహా లోధా సంస్కరణలపై చర్చించాడు. అతడి అధ్యక్షతన జరిగిన తొలి ఏజీఎమ్‌లో లోధా సంస్కరణల మార్పుకు సభ్యులూ ఆమోదం తెలిపారు. ఇక మిగిలింది అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆమోదం తెలపడమే.
- ఆరేళ్లకు విరామం ఉండదిక..!
ఈ సరికొత్త విధానానికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదిస్తే బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న ఆఫీస్ బేరర్.. మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలనే లోధా కమిటీ షరతు ఇక ఉండదు. బంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఐదేళ్లు పనిచేసిన దాదా.. తొమ్మిది నెలల్లో బీసీసీఐ అధ్యక్ష పదివిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా గంగూలీ 2024 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. అతడితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పూర్తికాలం తన పదవిలో కొనసాగవచ్చు. బీసీసీఐ పాలనలో అడుగడుగున అడ్డంకిగా మారుతున్న లోధా సంస్కరణలకు దాదా చరమగీతం పాడినట్లే.
- విరుద్ధ ప్రయోజనం...
పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై గంగూలీ దృష్టి సారించే అవకాశం ఉంది. ఇందులో కొన్ని నిబంధనలు రద్దు లేదా సవరణ సుప్రీం చేతుల్లోనే ఉంది. వీటిపై అత్యున్నత న్యాయస్థానం ఒప్పుకుంటే జట్టుకు మాజీ క్రికెటర్ల సలహాలు, సూచనలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు పదవుల్లో ఉన్న ఆటగాళ్లకు ఇది ఇబ్బందిగా మారింది.
ఆటగాడు-వ్యాఖ్యాత, వ్యాఖ్యాత-ఐపీఎల్-ఫ్రాంచైజీ సిబ్బంది, వ్యాఖ్యాత-పాలకుడు-ఫ్రాంచైజీ మార్గనిర్దేశకుడు, బీసీసీఐ పదవి-ఐపీఎల్ ఫ్రాంచైజీ ఉద్యోగి వంటి అంశాల్లో ప్రస్తుతం ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్, గంగూలీ సహా మరెంతో మంది పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన నోటీసులు అందుకున్నారు. దీనిపై ఓ కీలక అడుగు ముందుకు పడే అవకాశం ఉంది.
3. టెస్టు మ్యాచ్ నాలుగురోజులే...
టెస్టు మ్యాచ్‌లపై ప్రజలకు ఆసక్తిని, జట్ల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు వినూత్నంగా ఈ ఏడాది టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). త్వరలో మరో కొత్త నిర్ణయంతో ముందుకొస్తుంది. అదే ఐదు రోజుల సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌ను నాలుగురోజులకు కుదించడం. సభ్యదేశాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. అన్నీ ఓకే అయితే 2023 నుంచి ఈ పద్ధతి అమల్లోకి రానుంది. 140 ఏళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్‌ను ఐదు రోజులే జరుగుతున్నాయి. దీనిపై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు అనూకాలంగా ఉన్నట్లు సమాచారం.
గతంలోనే...
నాలుగురోజుల టెస్టు అనేది పాత అంశమే. 2019లో ఇంగ్లాండ్-ఐర్లాండ్ జట్లు ఈ మ్యాచ్ ఆడాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు 2017లోనే ఈ తరహా మ్యాచ్ ఆడింది.
4. విజేత తేలేవరకు సూపర్ ఓవర్లే...
2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో... న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తుదిపోరు టై గా ముగిసింది. దీంతో అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్ణయించారు. సూపర్ ఓవర్‌లోనూ పరుగులు సమం కావడం వల్ల ఎక్కువ బౌండరీలు బాదిన ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌ను ఛాంపియన్‌గా నిర్ణయించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. క్రికెటర్లు, మాజీలు పెదవి విరిచారు. క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఐసీసీని విమర్శించారు. అయితే సూపర్ ఓవర్‌లోనూ స్కోరు సమమైతే విజేత తేలేవరకు అనేక సూపర్ ఓవర్లు ఆడించే పద్ధతిని క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో ప్రవేశపెట్టినా... అధికారికంగా ఐసీసీ అమలు చేయాల్సి ఉంది. దీనిపై నిర్ణయం తీసుకుంటే ఇది ఈ ఏడాది ప్రపంచకప్‌లో అమలయ్యే అవకాశం ఉంది.
5. పాకిస్థాన్,భారత్ మధ్య ద్వైపాక్షిక సిరీస్..