టీ20ల్లో బౌండరీల వద్ద ఆటగాళ్లు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడం చూస్తుంటాం. ఆస్ట్రేలియాకు చెందిన మాట్ రెన్షా పట్టిన ఓ స్టన్నింగ్ క్యాచ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బ్రిస్బేన్ వేదికగా గురువారం బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ప్రత్యర్థి హరికేన్స్ జట్టుకు చెందిన కెప్టెన్ మాథ్యూ వేడ్‌ను అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు రెన్షా. అయితే బౌండరీ లైన్ వద్ద పరుగెత్తుకొని వచ్చి క్యాచ్ పట్టిన ఇతడు.. వేగాన్ని అదుపుచేసుకోలేక గీత దాటాడు. అయితే ఆ సమయంలో బంతి గాల్లోకి విసిరేశాడు. అయితే అది మళ్లీ అందుకునే సమయంలోనూ బౌండరీ లైన్ అవతలే ఉన్నాడు. మరో ప్రయత్నంలో మళ్లీ మైదానంలోకి బంతిని తోయగా ఎదురుగా ఉన్న తన జట్టు సభ్యుడు టామ్ బాంటన్ క్యాచ్ పట్టాడు. ఇది చూసిన అంపైర్లు, ఆటగాళ్లుకు అది ఔట్, నాటౌట్ అనేది తేల్చుకోలేకపోయారు.
తొలుత అంపైర్లు ఔట్‌గా ప్రకటించగా.. మూడో అంపైర్ మాత్రం నాటౌట్ అని చెప్పాడు. మైదానంలోని అంపైర్ల నిర్ణయంతో వేడ్ 61 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్.. బ్రిస్బేన్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.