తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రిటైర్ అవుతుంటే ఆనందంగా ఉంది' - srilanka

బంగ్లాదేశ్​తో శుక్రవారం జరిగే మ్యాచే శ్రీలంక బౌలర్ లసిత్ మలింగకు చివరి అంతర్జాతీయ వన్డే​. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే ఉద్దేశంతో రిటైర్మెంట్ ప్రకటించాడు మలింగ. ఈ నిర్ణయం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు.

మలింగ

By

Published : Jul 25, 2019, 5:45 PM IST

శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్​కు వీడ్కోలు పలకనున్నాడు. కొలంబో వేదికగా బంగ్లాదేశ్​తో శుక్రవారం తన చివరి వన్డే ఆడనున్నాడు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.

బంగ్లాదేశ్​ వన్డే సిరీస్ మలింగకు చివరిదని ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ కరుణరత్నే తెలిపాడు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు మలింగానే స్వయంగా వెల్లడించాడు.

"పరిమిత ఓవర్ల క్రికెట్​కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం. నాకు సంతోషంగా ఉంది. యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశమిచ్చి వచ్చే ప్రపంచకప్​నకు సిద్ధం చేయొచ్చు" - లసిత్ మలింగ, శ్రీలంక క్రికెటర్​

టీ 20లకు మాత్రం మలింగ అందుబాటులో ఉంటాడని చెప్పింది శ్రీలంక క్రికెట్ బోర్డు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ 20 ప్రపంచకప్​లో ఆడతాడని స్పష్టం చేసింది.

లంక తరఫున వన్డేల్లో 219 ఇన్నింగ్స్​లో 335 వికెట్లు తీశాడు మలింగ. ఆ దేశం నుంచి అత్యధిక వికెట్లు తీసిన వన్డే బౌలర్లలో మూడో స్థానంలో ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్(523), చమిందావాస్(399) ఈ జాబితాలో ముందున్నారు.

ఈ ప్రపంచకప్​లో 7 ఇన్నింగ్స్​ల్లో 13 వికెట్లు తీసిన మలింగ.. శ్రీలంక జట్టులో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు. 30 టెస్టులు ఆడిన ఈ క్రికెటర్​.. 101 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2011 ప్రపంచకప్​ తర్వాత ఈ ఫార్మాట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు.

ABOUT THE AUTHOR

...view details