భారత సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ.. మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే విషయమై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీమాట్లాడాడు. మిస్టర్ కూల్.. తన కెరీర్‌పై నిర్ణయాన్ని సెలక్టర్లు, టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి కచ్చితంగా చెప్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా వారితో ప్రస్తుతం టచ్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
"కెప్టెన్ కోహ్లీతో ధోనీ టచ్‌లోనే ఉన్నాడు. త్వరలో సెలక్టర్లతోనూ తన ప్రణాళిక, నిర్ణయంపై చర్చిస్తాడని అనుకుంటున్నా. అయితే ఈ మీడియా వేదికపై ఈ విషయం గురించి మాట్లాడటం సబబు కాదని భావిస్తున్నా"
-- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
అలాంటి ప్లేయర్ మళ్లీ దొరకడు
ధోనీ సారథ్యంలోనే భారత్.. మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకుంది. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్‌ను ఇతడి హాయాంలోనే సాధించింది టీమిండియా. 38 ఏళ్ల ధోనీపై ఇటీవల గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి దమ్మున్న ఆటగాడి స్థానాన్ని వేరొకరు భర్తీ చేయడం సాధ్యం కాదని అన్నాడు. అయితే క్రికెట్ వీడ్కోలుపై ధోనీ ఆలోచనే తుది నిర్ణయమని చెప్పాడు దాదా.
ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓటమి తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టలేదు ధోనీ. ఆ తర్వాత ఆర్మీలోనూ కొన్ని రోజులు పనిచేసిన మహీ... కొన్నిసార్లు యువ క్రికెటర్లతో కలిసి కనిపించాడు. పలువురు క్రీడాకారులను కలిశాడు.
అయితే అతడి క్రికెట్ భవితవ్యంపై మాత్రం ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అతడి కెరీర్‌పై నిర్ణయం, ఐపీఎల్ తర్వాత తేలుతుందని పలువురు క్రికెటర్లు వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికే అంశంపై స్పందించిన ధోనీ... వచ్చే జనవరి తర్వాతే ఈ విషయంపై మాట్లాడతానని అన్నాడు. ప్రస్తుతం తాత్కాలిక విరామంలో ఉన్న మహీ... వచ్చే ఏడాది ఐపీఎల్లో మాత్రం ఆడనున్నాడు.