1983 ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన క్రిష్ణమాచారి శ్రీకాంత్, భారత మహిళా జట్టు మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరికి ప్రతిష్టాత్మక సీకే నాయుడు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది బీసీసీఐ. 2019 ఏడాదికి గానూ వీరిని ఎంపిక చేసింది.
"శ్రీకాంత్, అంజుమ్‌ను జీవన సాఫల్య పురస్కారాలకు ఎంపిక చేశాం. క్రికెట్లో వారి సేవకు గానూ ఈ అవార్డులను ప్రకటించాం. వీరిద్దరూ ఈ గౌరవానికి పూర్తి అర్హులుగా బీసీసీఐలోని ప్రతి ఒక్కరూ భావించారు" -బీసీసీఐ ప్రతినిధి
జనవరి 12న ముంబయిలో జరిగే బీసీసీఐ వార్షిక అవార్డు వేడుకలో ఈ పురస్కారాలను మాజీ క్రికెటర్లకు ప్రదానం చేయనున్నారు.
60ఏళ్ల శ్రీకాంత్.. 1981-92 మధ్య కాలంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 43 టెస్టుల్లో 2063 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 12 అర్ధశతకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇతడు1983 ప్రపంచకప్ భారత జట్టులో కీలక సభ్యుడు. ఆ మెగాటోర్నీ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (38) శ్రీకాంత్‌దే.
42 ఏళ్ల అంజుమ్ చోప్రా.. మిథాలీ రాజ్ కంటే ముందు అత్యుత్తమ బ్యాట్స్ఉమన్ల్లో ఒకరు. ఈ ఎడం చేతివాటం బ్యాట్స్ఉమన్ 12 టెస్టుల్లో 548 పరుగులు, 127 వన్డేల్లో 2856 పరుగులు చేసింది. ఇందులో ఓ శతకం, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా 18 టీ20లు కూడా ఆడింది. 1995 నుంచి 2006 వరకు కీలక ప్లేయర్‌గా మెప్పించింది.
ఇదీ చదవండి: ఒలింపిక్స్ ట్రయల్స్ ఫైనల్లో మేరీ - నిఖత్ ఢీ