ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఓటమిపై కోహ్లీ మాట్లాడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి.. తన అతి విశ్వాసమే కారణమని అన్నాడు విరాట్. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమిండియా... కీలక మ్యాచ్‌లో ఓటమిపాలవడం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నట్లు చెప్పుకొచ్చాడు.
" వరల్డ్‌కప్ ఓటమి నాపై తీవ్ర ప్రభావం చూపింది. సెమీస్‌లో ఓడిపోవడం వల్ల జట్టంతా బాధపడ్డారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం వల్ల చివరి వరకు నాటౌట్‌గా ఉండాలని నిశ్చయించుకున్నా. కానీ అది కాపాడుకోవడంలో విఫలమయ్యాను. ఎందుకంటే అతి విశ్వాసం నాలో నిండిపోడవం వల్ల నేను పరిస్థితులకు తగ్గట్లు జాగ్రత్తపడలేకపోయాను".
-- కోహ్లీ, టీమిండియా సారథి
బలమైన కోరిక, సంకల్పం ఉన్నప్పుడు అన్నీ సాధించగలుగుతామని చెప్పిన కోహ్లీ... ఓడిపోవడాన్ని ద్వేషిస్తానన్నాడు.
"ఓటమితో మైదానాన్ని వీడటం ఇష్టపడను. బరిలోకి దిగడాన్ని గౌరవంగా భావిస్తా. శక్తి ఉన్నంత వరకు పోరాడతా. భవిష్యత్తు తరాలు జట్టు ఆటతీరు గురించి చర్చించుకునే విధంగా పోరాడాలని భావిస్తున్నాం" అని అన్నాడు విరాట్.
ఓల్డ్‌ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన సెమీస్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఒక పరుగుకే ఔట్ కాగా... టోర్నీ మొత్తం సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ రోహిత్ శర్మ కూడా సింగిల్ రన్‌కే పెవిలియన్‌కు చేరాడు. అయితే రవీంద్ర జడేజా(77), ధోనీ(50)లు హాఫ్ సెంచరీలతో చివరి వరకు పోరాడినా టీమిండియాను గెలిపించలేకపోయారు. ఫలితంగా 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 221 ఆలౌటైంది భారత జట్టు.
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం దూసుకెళ్తోంది. ఇటీవల జరిగిన మూడు వరుస టెస్టు సరీస్‌లు(విండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్) గెలిచింది కోహ్లీసేన. డిసెంబర్ నుంచి భారత్‌లో పర్యటనకు వస్తోంది వెస్టిండీస్ జట్టు. ఇందులో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 6న నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.