వెస్టిండీస్‌తో తొలి టెస్టులో 318 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది టీమిండియా. జట్టు మొత్తం సమష్టిగా రాణించిన వేళ.. టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఘనంగా ఆరంభించింది. ఈ గెలుపుతో ఓవర్సీస్లో కొత్త రికార్డు సృష్టించాడు కెప్టెన్ కోహ్లీ. విదేశీ పర్యటనల్లో అత్యధిక టెస్టులు(12) గెలిచిన భారత సారథిగా అరుదైన ఘనత అందుకున్నాడు. మాజీ ఆటగాడు గంగూలీ(11) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.
గంగూలీ రికార్డు చెరిపేసిన విరాట్
గంగూలీ 28 మ్యాచ్‌ల్లో 11 గెలవగా, కోహ్లీ 26 మ్యాచ్‌ల్లో 12 విజయాలు అందుకుని ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 27 టెస్టుల్ని గెలిపించిన భారత్ కెప్టెన్‌గా.. మహేంద్ర సింగ్ ధోనీ సరసన నిలిచాడు.
ఓవర్‌నైట్ స్కోరు 185/3తో నాలుగోరోజు మ్యాచ్ ఆరంభించిన టీమిండియా.. 158 పరుగుల జోడించి 343 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆధిక్యంతో కలిపి ప్రత్యర్థికి 418 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.