టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ భారత క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. టీ20, వన్డే ప్రపంచకప్‌ను అందుకున్నాడు. ఉత్తమ సారథి, ఫినిషర్‌గా చిరస్మరణీయ విజయాలు సాధించాడు. అయితే ధోనీకి క్రికెట్ కెరీర్‌లో ఆరంభం అద్భుతంగా సాగలేదని భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు విశాఖ వేదికగా పాకిస్థాన్‌పై ధోనీ తన తొలి శతకాన్ని బాదాడు. 123 బంతుల్లో 148 పరుగులు సాధించాడు. ఈ సందర్భంగా ధోనీ కెరీర్ తొలినాళ్లలో జరిగిన విషయాల గురించి నెహ్రా మాట్లాడాడు.
"ఆ ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియాకు ఉత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దొరికాడని భావించారంతా. అయితే ఆదిలో ధోనీకి శుభారంభం దక్కలేదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆ ఇన్నింగ్స్‌తో.. జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. తనపై తనకి ఉన్న విశ్వాసమే అతడి బలం. ఆ ఇన్నింగ్స్‌తో అతడు పరుగుల దాహంతో ఉన్నాడని తెలిసింది. అయితే ఆ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడినా మాకు ధోనీ దొరికాడు."