2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ లీగ్ మ్యాచ్. ఎవరు గెలుస్తారా? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అనుహ్యంగా మ్యాచ్ 'టై' అయింది. సూపర్ ఓవర్ కాకుండా బౌల్-అవుట్ పెట్టారు. అందులో ఎక్కువ వికెట్లు తీయడం వల్ల టీమ్ఇండియా విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్లోనూ పాక్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచింది. ఆ టోర్నీ గురించి మాట్లాడిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.
"బౌల్-అవుట్ పెట్టే సమయానికి పాక్ క్రికెటర్లు అందుకోసం సిద్ధంగా లేరు. మేం మాత్రం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. వారి నుంచి కనీస పోటీ లేకపోవడం వల్ల గెలుపు మా సొంతమైంది"
-ఇర్ఫాన్ పఠాన్, మాజీ ఆల్‌రౌండర్
ధోనీ కీలక నిర్ణయం...
"అప్పట్లో ప్రాక్టీస్‌కు ముందు వార్మప్ చేసేవాళ్లం. కానీ బౌలింగ్ కోచ్ వెంకీ(వెంకటేశ్ ప్రసాద్) మాత్రం మాతో బౌల్-అవుట్ చేయించేవాడు. బ్యాట్స్‌మెన్‌లో సెహ్వాగ్, రోహిత్, నేను ఎక్కువగా ప్రాక్టీసు చేసేవాళ్లం. ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ 'టై' అవడం వల్ల మాకు చాలా ఆనందమేసింది. ఎందుకంటే దాదాపు ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను నిలబెట్టుకున్నాం. ఆ తర్వాత విజయం సాధించాం. ఈ విషయంలో పూర్తి ఘనత ధోనీదే. బౌలింగ్ ఎప్పుడూ వేయని నేను.. బౌల్ అవుట్ సమయంలో బంతి కావాలని అడిగినప్పుడు సరేనని నాకు అవకాశమిచ్చాడు" అని సీనియర్ క్రికెటర్ ఊతప్ప చెప్పాడు.
మ్యాచ్‌లో భారత్ తరఫున వీరేందర్ సెహ్వాగ్, రాబిన్ ఊతప్ప, హర్భజన్ సింగ్ బంతులేసి ముగ్గురూ వికెట్లకు తాకించారు. పాక్ తరఫున అరాఫత్, ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిది ముగ్గురూ విఫలమయ్యారు. దాంతో భారత్ విజేతగా నిలిచింది.