ఐపీఎల్ 14వ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీని నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. కనీసం మూడు జట్లతో బయో-బబుల్ వాతావరణాన్ని సృష్టించడానికి బహుళ మైదానాలతో పాటు ఆటగాళ్ల కోసం హోటళ్లున్న కొన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలను బీసీసీఐ పరిశీలిస్తుంది.
"అవును, ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలికి తీసేందుకు, ముందుగా ముస్తాక్ అలీ ట్రోఫీని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫైవ్‌స్టార్ సదుపాయాలు కలిగి ఉన్న హోటళ్లకు కనీసం మూడు మైదానాలు ఉన్న రాష్ట్ర యూనిట్లను బీసీసీఐ పరిశీలిస్తుంది. కనీసం 10 రాష్ట్ర యూనిట్లను సంప్రదించి.. వారు బయో-బబుల్ వాతావరణాన్ని సృష్టించగలరా అని అడిగి తెలుసుకుంటారు. పదింటిలో ఆరు సంఘాల నుంచి సానుకూల స్పందన వచ్చినా.. ముస్తాక్ అలీ టోర్నీని రెండు వారాల్లోనే పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తుంది. దీంతో పాటు రంజీ ట్రోఫీని ప్రారంభించే అవకాశం ఉంది" అని ఓ రాష్ట్ర యూనిట్ అధికారి వెల్లడించారు.