ఐపీఎల్ 14వ సీజన్ కోసం ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి ఫ్రాంచైజీలు. విజేతగా నిలిచేందుకు అన్ని జట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈసారి మెగా వేలం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా మినీ వేలం మాత్రమే నిర్వహించారు. ఇందులో కొన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయగా మరికొన్ని ఫ్రాంచైజీలు యువకుల వైపు ఆసక్తి కనబర్చాయి. ప్రస్తుతం ప్రతి జట్టు జూనియర్లు, సీనియర్లతో సమతూకంగా ఉన్నాయి. 40కి పైగా వయసున్న క్రిస్ గేల్, ఇమ్రాన్ తాహిర్ వంటి ఆటగాళ్లు ఇంకా తమ సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ వంటి యువకులు పరుగుల వరద పారించాలని కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో ప్రతి జట్టులోని అతిపెద్ద, అతిచిన్న వయసు గల ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.
చెన్నై సూపర్ కింగ్స్
పెద్దోడు-ఇమ్రాన్ తాహిర్
దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కేవలం చెన్నై సూపర్ కింగ్స్‌లోనే పెద్ద వయసు గల వాడు కాక.. ఈ సీజన్లోనే అతి ఎక్కువ వయసు కలిగిన ఆటగాడు. ఇతడు శనివారం నాడు తన 42వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. 2019 సీజన్లో 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ సాధించాడు. కానీ గతేడాది మాత్రం ఇతడికి తగిన అవకాశాలు ఇవ్వలేదు. ఎక్కువ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 58 మ్యాచ్‌లాడిన తాహిర్ 80 వికెట్లు దక్కించుకున్నాడు.
చిన్నోడు-భగత్ వర్మ
దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన హైదరాబాద్‌కు చెందిన భగత్ వర్మ.. ఐపీఎల్‌లోనూ రాణించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సీజన్ వేలంలో ఈ 22 ఏళ్ల బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. తన నైపుణ్యాలు పెంపొందిచుకోవడానికి ఈ లీగ్ ఎంతగానో దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు.
దిల్లీ క్యాపిటల్స్
పెద్దోడు - అమిత్ మిశ్రా
ఇప్పటివరకు జరిగిన 13 ఐపీఎల్ సీజన్లలోనూ పాల్గొన్న అతి కొద్దిమంది ఆటగాళ్లలో అమిత్ మిశ్రా ఒకడు. 38 ఏళ్ల ఈ స్పిన్నర్‌ను గత వేలంలో దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్లో 150 మ్యాచ్‌లాడిన మిశ్రా 160 వికెట్లు సాధించాడు. లీగ్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో మలింగ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. గత సీజన్లోనూ మంచి ఫామ్‌లో కనిపించినా.. గాయం కారణంగా దూరమయ్యాడు.
చిన్నోడు - పృథ్వీ షా
దిల్లీ క్యాపిటల్స్ జట్టులో 21 ఏళ్ల పృథ్వీ షా చిన్నవాడు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటున్న షా.. టీమ్ఇండియా భవిష్యత్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. గత సీజన్ ప్రారంభంలో మంచి స్కోర్లు సాధించినా.. వెంటనే ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డాడు. ఐపీఎల్ 2020లో 13 మ్యాచ్‌ల్లో 228 పరుగులు సాధించాడు. ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో మూడు సెంచరీలతో సత్తాచాటాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ (227) కూడా ఉంది. దీంతో ఈసారి ఇతడిపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటివరకు 38 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన షా 139 స్ట్రైక్ రేట్‌తో 826 పరుగులు సాధించాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్
పెద్దోడు - హర్భజన్ సింగ్
గతేడాది వ్యక్తిగత కారణాల వల్ల సీజన్‌కు దూరంగా ఉన్న టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఈ సీజన్లో మళ్లీ బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది వేలానికి ముందు ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ వదిలేయగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 40 ఏళ్ల భజ్జీ ఇప్పటివరకు 160 మ్యాచ్‌లాడి 150 వికెట్లు సాధించాడు.
చిన్నోడు - కమలేశ్ నాగర్కోటి
2018 అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు యువ పేసర్ కమలేశ్ నాగర్కోటి. ప్రస్తుతం ఈ టీమ్‌లో ఉన్న ముగ్గురు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నారు. గత రెండు సీజన్లలోనూ గాయాల కారణంగా ఎక్కువగా మ్యాచ్‌లు ఆడని ఇతడు.. చివరి సీజన్ ఆఖర్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన ఇతడు 5 వికెట్లు దక్కించుకున్నాడు.
ముంబయి ఇండియన్స్
పెద్దోడు - రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఈ జట్టులో అందరి కంటే పెద్దవాడు. ఈ జట్టులోని విండీస్ విధ్వంసకర వీరుడు పొలార్డ్ కంటే హిట్‌మ్యాన్ 15 రోజులు పెద్ద. ప్రస్తుతం వీరిద్దరికి 33 ఏళ్లు. ఐపీఎల్లో 2008లో అరంగేట్రం చేసిన రోహిత్ 2011లో ముంబయి జట్టులో చేరాడు. ఇప్పటివరకు జట్టుకు 5 ట్రోఫీలు అందించి కెప్టెన్‌గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 200 మ్యాచ్‌లాడి 5230 రన్స్ సాధించాడు. లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. గత సీజన్లో 12 మ్యాచ్‌లాడి 332 పరుగులు సాధించాడు.
చిన్నోడు - మార్కో జాన్సెన్