భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్.. దిల్లీ క్యాపిటల్స్ బృందంతో కలిశాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ప్రాక్టీసు ప్రారంభించాడు. ఈ ఫ్రాంచైజీ తన ఇల్లు లాంటిదని, జట్టులో చాలామంది క్రికెటర్లతో ఇప్పటికే ఆడి ఉండటం వల్ల కొత్తగా అనిపించట్లేదని ఆసక్తికర అన్నాడు.
ఆ జట్టు నాకు ఇల్లు లాంటిది: ఉమేశ్ యాదవ్ - ఉమేశ్ యాదవ్ ఐపీఎల్
దిల్లీ జట్టులోకి తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేసిన ఉమేశ్ యాదవ్.. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు కృషి చేస్తానని అంటున్నాడు. ఏప్రిల్ 10న దిల్లీ క్యాపిటల్స్, తన తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడనుంది.
ఉమేశ్, ఐపీఎల్ కెరీర్‌ను దిల్లీ డేర్డెవిల్స్తోనే(అప్పటి దిల్లీ జట్టు పేరు) ప్రారంభించాడు. ఆ తర్వాత కాలంలో ఇతర జట్లలో ఆడిన ఇతడు.. దాదాపు పదేళ్ల తర్వాత తిరిగి దిల్లీ జట్టులోకి రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. దిల్లీ క్యాంప్‌లో తను చాలా సౌకర్యంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. మొత్తంగా ఇప్పటివరకు లీగ్‌లో 121 మ్యాచ్‌లాడి 119 వికెట్లు తీశాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఉమేశ్‌ను కనీస ధర రూ.1 కోటికి కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్. గాయంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఈ సీజన్‌కు దూరమవగా.. పంత్ కొత్త సారథిగా వ్యవహరించనున్నాడు.