ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లూ భాగం కానున్నారు. వారిలో ప్రతిభావంతులైన హార్డ్ హిట్టింగ్ టాప్ బ్యాట్స్‌మెన్ దగ్గర నుంచి అద్భుత బౌలర్లు, వికెట్ కీపర్లు ఈసారి ఐపీఎల్లో పాల్గొంటున్నారు.
విదేశీ ఆటగాళ్లలో ఎక్కువమంది టీ20 ఫార్మాట్లో గణనీయంగా రాణిస్తున్నారు. వారంతా ఐపీఎల్‌లోనూ కీలకంగా మారే అవకాశం ఉంది. అలాంటి సత్తా కలిగినా.. అంత ప్రాధాన్యం లభించని ఆటగాళ్లు ఏ ఫ్రాంచైజీలో ఉన్నారో తెలుసుకుందాం.
5) మార్కస్ స్టోయినిస్ (దిల్లీ క్యాపిటల్స్)
అరుదైన ఆటగాళ్ల జాబితాకు చెందిన వాడు మార్కస్ స్టోయినిస్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్, నిలకడగా బౌలింగ్ చేయగల సామర్థ్యం ఇతనిలో ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌కు స్టోయినిస్ ఆటతీరు బాగా నప్పుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్రికెటర్లో మంచి ఫీల్డర్ కూడా ఉన్నాడు.
2015లో క్రికెట్ కెరీర్ ప్రారంభించిన స్టోయినిస్‌కు ఆరంభంలో ఒడుదుడుకులు ఎదురయ్యాయి. తిరిగి రాణించాలని కలగా పెట్టుకున్న స్టోయినిస్.. 2017లో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 146 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 2018-19 ఏడాదికిగానూ ఆస్ట్రేలియా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తింపు పొందాడు. 2019 ప్రపంచకప్‌లోనూ భాగమయ్యాడు.
బిగ్‌బాష్ లీగ్ 2018-19లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టోయినిస్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఆ టోర్నీలో 53.30 సగటుతో 533 పరుగులు సాధించి.. అదే సమయంలో 14 వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండర్‌గా ప్రతిభ కనుబరుస్తున్న స్టోయినిస్ ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
4) ఆండ్రూ టై (రాజస్థాన్ రాయల్స్)
ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ టైకి టీ20 ఫార్మాట్లో అద్భుత రికార్డు ఉంది. 26 ఏళ్ల వయసులో 2013-14 సీజన్లో ఆస్ట్రేలియా-ఏ జట్టు ద్వారా అరంగేట్రం చేసిన టై.. అనతికాలంలోనే టాప్ ర్యాంక్ ఆటగాడిగా ఎదిగాడు. మూడేళ్ల తర్వాత భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో తొలుత గుజరాత్ లయన్స్ జట్టులో ఆడి.. తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించాడు. అరంగేట్రంలోనే (5/17) అసాధారణ ప్రతిభ కనబరచాడు.