తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆనంద్‌ మహీంద్రకు నట్టూ రిటర్న్‌ గిఫ్ట్‌ - ఆనంద్‌ మహీంద్ర

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో అదరగొట్టిన భారత యువ క్రికెటర్లకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర.. కార్లను బహుమతిగా ఇచ్చాడు. దానికి బదులుగా భారత పేసర్ నటరాజన్​.. మహీంద్రకు రిటర్న్​ గిఫ్ట్​ ఇచ్చాడు. వెన్ను తట్టి ప్రోత్సహించే అద్భుతమైన వ్యక్తికి ధన్యవాదములు అని ట్వీట్​ చేశాడు.

Indian pacer Natarajan gave a return gift to Anand Mahindra
ఆనంద్‌ మహీంద్రకు నటరాజన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌

By

Published : Apr 2, 2021, 11:59 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్ర సిరీస్‌లోనే అద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లకు.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర అప్పట్లో థార్‌ ఎస్‌యూవీ కార్లను బహుమతిగా ప్రకటించాడు. అయితే, దానికి బదులుగా నట్టూ కూడా మహీంద్రకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చినట్లు తెలిపాడు.

కంగారూల గడ్డపై తొలి టెస్టులో ఘోరంగా ఓటమిపాలైన టీమ్‌ఇండియా తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో చెలరేగి ఆడి 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లు.. శార్దూల్ ఠాకూర్‌‌, నవ్‌దీప్‌ సైని, నటరాజన్‌, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో వీరి ప్రదర్శన మెచ్చిన మహీంద్ర.. తన కంపెనీ నుంచి తలా ఓ ఎస్‌యూవీ కారును బహుమతిగా ఇస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో నటరాజన్ తాజాగా ఆ కారును అందుకున్నాడు.

ఆస్ట్రేలియా సిరీస్​లో గబ్బాలో చారిత్రక విజయం సాధించింది టీమ్‌ఇండియా. ఆ టెస్టులో తాను ధరించిన జెర్సీని నటరాజన్‌.. మహీంద్రకు బహుమతిగా ఇచ్చాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ గురువారం రాత్రి రెండు ట్వీట్లు చేశాడు.

'టీమ్‌ఇండియా తరఫున ఆడటం నా జీవితంలో పెద్ద కల. నాకది గర్వకారణం. నా ఎదుగుదల మొత్తం అనూహ్యంగా జరిగింది. ఈ ప్రయాణంలో నాకు లభించిన ప్రేమాభిమానాలు నన్ను మైమరపించాయి. ఇలా వెన్నుతట్టి ప్రోత్సహించే అద్భుతమైన వ్యక్తులు ఉంటే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసుకునే మార్గాలు నా ముందుకు వస్తాయి. నాకు మహీంద్ర థార్‌ను బహుమతిగా ఇచ్చినందుకు.. ఆనంద్‌ మహీంద్ర సర్‌కు ధన్యవాదాలు. నన్నూ, నా ప్రయాణాన్ని గుర్తించినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. క్రికెట్‌ పట్ల తనకున్న అమితమైన ప్రేమకు గుర్తుగా నా గబ్బా టెస్టు జెర్సీని సంతకంతో అందజేస్తా' అని నటరాజన్‌ భావోద్వేగంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఎస్‌యూవీ కారుతో పాటు తాను సంతకం చేస్తున్న జెర్సీ ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.

ఇదీ చదవండి:ఐపీఎల్‌ నాయకా.. ఎలా నడిపిస్తావో నీవిక!

ABOUT THE AUTHOR

...view details