భారత్, వెస్టిండీస్ తొలి టీ20పై సందిగ్ధం నెలకొంది. మ్యాచ్ వేదికను ముంబయి నుంచి మరో చోటుకు తరలించాలని ఎంసీఏను స్థానిక పోలీసులు కోరుతున్నారట. మ్యాచ్ నిర్వహణకు సరిపడా భద్రతా సిబ్బందిని కేటాయించలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 6న వాంఖడేలో మ్యాచ్ జరగాలి. కానీ అది బాబ్రీ మసీద్ కూల్చివేసిన దినం. ఇటీవల అయోధ్యపై తీర్పు వచ్చిన తర్వాత మొదటిసారి ఈ రోజున ఎలాంటి అల్లర్లు జరగకుండా నగరంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా డిసెంబర్ 6న బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి. ఇందుకు వేలాది మంది హాజరై 'మహాపరినిర్వాణ్ దివస్'గా జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో రెండు కార్యక్రమాలకు వేల సంఖ్యలో బలగాలను నగరంలో మోహరించాల్సి ఉంటుంది.